
అమ్మాయిల నంబర్ సేకరించి.. ఆపై మెసేజ్‌లు...
‘‘సోషల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి వచ్చా.. మీకు ఉపకారవేతనం వచ్చిందా? రాలేదా? అయితే మీ ఫోన్ నంబర్
ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన యువకులు
రాజోలు : ‘‘సోషల్ వెల్ఫేర్ కార్యాలయం నుంచి వచ్చా.. మీకు ఉపకారవేతనం వచ్చిందా? రాలేదా? అయితే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి మీకు ఉపకారవేతనం వచ్చేలా చూస్తా’’ అంటూ ఇంటర్ నుంచి డిగ్రీ చదివే అమ్మాయిల ఫోన్ నంబర్ల సేకరించి ఆపై వారికి మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తిని బుధవారం పలువురు యువకులు గుర్తించి రాజోలు పోలీసులకు అప్పగించారు.
అప్పనపల్లి గ్రామానికి చెందిన యాండ్ర చక్రపాణి పలు కళాశాలలకు చెందిన అమ్మాయిలకు తన ఫోన్ ద్వారా మెసేజ్‌లు ఇవ్వడం, ఒకే నంబర్ నుంచి చాలా మందికి మెసేజ్‌లు రావడంపై తాటిపాక విద్యానిధి కళాశాలకు చెందిన యువకులు మాటు వేసి చక్రపాణిని గుర్తించారు. అమ్మాయిలకు ఎందుకు మెసేజ్‌లు ఇస్తున్నావంటూ నిలదీశారు. ఇదే విషయాన్ని ఆ యువకులు రాజోలు ఎస్సై లక్ష్మణరావు దృష్టికి తీసుకువెళ్లి చక్రపాణిని పోలీసులకు అప్పగించారు.
ఈ విషయంపై చక్రపాణిని ప్రశ్నిస్తే తాను స్వచ్ఛంధ సంస్థ ద్వారా ఉపకారవేతనాలు రాని వారికి సహాయం చేస్తున్నానంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. ఈ సంఘటనపై మెసేజ్‌లు వచ్చిన అమ్మాయిలు, వారి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మణరావు వివరించారు.