హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Published Fri, Sep 2 2016 1:09 AM

life prison

కర్నూలు(లీగల్‌): ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.35 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.అనుపమ చక్రవర్తి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన ఈశ్వరమ్మకు అరోరానగర్‌కు చెందిన సి.తిమ్మయ్యతో వివాహేతర సంబంధం ఉంది. తిమ్మయ్య తన లైంగింక కోరికను ఈశ్వరమ్మ కుమార్తెతో తీర్చమని వేధించాడు. దీంతో అతడిని అంతం చేయాలని భావించి కల్లూరు మండలం బస్తిపాడుకు చెందిన బోయ విజయసేనతో కలిసి ఆమె పథకం వేసింది. 2011 సంవత్సరం డిసెంబరు 24న కసాపురం ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్దామని తిమ్మయ్యను నమ్మించి తీసుకెళ్లింది. కసాపురంలో విజయసేనను పరిచయం చేసి కారులో కర్నూలుకు బయలుదేరారు. డోన్‌ మండలం కొత్తకోట గ్రామ సమీపం చేరగానే అక్కడ తిమ్మయ్యను కారు దింపి బండరాయితో తలపై మోది చంపేశారు. మతదేహాన్ని వెంగలాంపల్లె చెరువు సమీపంలోని గుంతలో పడేసి రాత్రి కర్నూలుకు చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత మతదేహం బయటపడింది. అయితే ఆచూకీ లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేశారు. హతుడిని ఎవరు గుర్తుపకట్టకపోవడంతో పోలీసులు కేసును మూసివేశారు. రెండు సంవత్సరాల తర్వాత విజయసేన మరో కేసులో ఆదోని రెండో పట్టణ పోలీసులకు పట్టుబడి తిమ్మయ్య హత్య ఉదంతాన్ని బయటపెట్టాడు. దాంతో మూసివేసిన కేసును అప్పటి డోన్‌ సీఐ డేగల ప్రభాకర్‌ పునర్‌విచారణ చేశారు. అప్పటి మతదేహం పొటోలను హతుడు కుమారుడు రవికుమార్‌ గుర్తు పట్టాడు. ఈ మేరకు ఈశ్వరమ్మ, విజయసేలపై కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితులపై హత్యానేరం రుజువు కావడంతో వారికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.    
 

Advertisement
Advertisement