
'20 నుంచి మళ్లీ భూ సేకరణ'
రాజధాని కోసం ఈ నెల 20వ తేదీ నుంచి మళ్లీ భూ సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు.
విశాఖ: రాజధాని కోసం ఈ నెల 20వ తేదీ నుంచి మళ్లీ భూ సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ సేకరణపై న్యాయస్థానం తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికి 95 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని ఆయన వెల్లడించారు. కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆగిపోయిన పూలింగ్‌ను ఈనెల 20 నుంచి ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రానికి ప్రత్యే హోదా, ప్యాకేజీలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఆయనను స్వయంగా కలసి ఈ విషయమై చర్చిస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ... కొన్ని పట్టణాల్లో సమస్యలు పేరుకు పోయి ఉన్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాత వాటికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడిస్తామని ప్రకటిస్తామని వెల్లడించారు.