మెమోరీ కార్డ్‌ కోసం కిడ్నాప్‌ | Kidnapped for a memory card | Sakshi
Sakshi News home page

మెమోరీ కార్డ్‌ కోసం కిడ్నాప్‌

Aug 7 2016 9:22 PM | Updated on Sep 4 2017 8:17 AM

మెమోరీ కార్డ్‌ తిరిగి ఇవ్వలేదని యువకుడి అన్నను కిడ్నాప్‌ చేసి గాయపర్చాడో యువకుడు.

బంజారాహిల్స్‌: తమ్ముడు తీసుకున్న మెమోరీ కార్డ్‌ తిరిగి ఇవ్వలేదని అతడి అన్నను కిడ్నాప్‌ చేసి తీవ్రంగా గాయపర్చాడో యువకుడు.  జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఎన్బీ నగర్‌ నివాసి సీహెచ్‌ కృష్ణ ఆటో డ్రైవర్‌. ఇతని తమ్ముడు శ్రీకాంత్‌కు అదే ప్రాంతంలో నివసిస్తున్న బాబర్‌ స్నేహితుడు. ఇటీవల బాబర్‌ మెమోరీ కార్డ్‌ను శ్రీకాంత్‌ తీసుకుని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు.

అందులో తన కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఫొటోలు ఉన్నాయని బాబర్‌ చెప్పినా శ్రీకాంత్‌ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి దాటాక  బాబర్‌ ఎన్బీ నగర్‌లోని శ్రీకాంత్‌ ఇంటికి వచ్చి అతని అన్న కృష్ణను బలవంతంగా తన ఆటోలో ఎక్కించుకొని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 51 వైపు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీవ్రంగా కొట్టాడు. రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు కృష్ణ తప్పించుకొని కొద్ది దూరం పారిపోయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు బాబర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement