సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైలు | Sakshi
Sakshi News home page

సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైలు

Published Fri, May 27 2016 2:53 AM

సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైలు

ఆగస్టులో పనులకు శ్రీకారం
* మనోహరాబాద్ నుంచి లైను ప్రారంభం
* పదేళ్ల క్రితం ప్రాజెక్టు అంచనా రూ. 671.82 కోట్లు..
* తాజాగా రూ. 1,160 కోట్లు

సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ రైలు త్వరలో కూత పెట్టనుంది. హైదరాబాద్ రైలుమార్గంతో కరీంనగర్ అనుసంధానం కాబోతోంది. భాగ్యనగరంతో రైలు మార్గం ద్వారా అనుసంధానం లేకపోవటంతో వాణిజ్యపరంగా అంతగా అభివృద్ధి కాలేకపోతున్న కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి కీలక పట్టణాలకు మహర్దశ పట్టబోతుంది. దాదాపు రూ.1200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టులో మూడో వంతు వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం భరించనుంది.

తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాలకు రాజధానితో రైలుమార్గం ద్వారా అనుసంధానం ఉంది. హైదరాబాద్‌కు అతి చేరువగా ఉన్న మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డికి మెట్రో రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. ఇక ఒక్క కరీంనగర్‌కు మాత్రమే హైదరాబాద్‌తో రైల్వే లింకు లేకుండా పోయింది. శరవేగంగా విస్తరిస్తున్న సిద్దిపేట హైదరాబాద్‌కు వంద కిలోమీటర్లలోపే ఉన్నా వ్యాపార కేంద్రంగా అనుకున్నస్థాయిలో ఎదగలేకపోతోంది. సిద్దిపేటను కలుపుతూ హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రైల్వే లైను నిర్మించాలని దశాబ్దాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
 
ఎట్టకేలకు కదలిక
2004లో కేంద్రమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ డిమాండ్‌ను రైల్వేశాఖ ముందుంచి ఒత్తిడి పెంచారు. దీంతో 2006 బడ్జెట్‌లో దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వేశాఖ సర్వేకు పచ్చజెండా ఊపింది. ఆ తర్వాత ఆ ప్రతిపాదన పడకేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇందులో మళ్లీ కదలిక మొదలైంది. సికింద్రాబాద్-నిజామాబాద్ లైను నుంచి ఈ కొత్తలైను ప్రారంభమవుతుంది. మేడ్చల్ దాటాక వచ్చే మనోహరాబాద్ స్టేషన్ నుంచి దీన్ని ప్రారంభిస్తారు.

తొలుత సికింద్రాబాద్ నుంచే దీన్ని మొదలుపెట్టాలనుకున్నా... మధ్యలో రక్షణశాఖ స్థలాలుండటంతో అనుమతి రాలేదు. దీంతో మనోహరాబాద్ నుంచి ప్రారంభించి రాజీవ్ రహదారికి ఎడమవైపు కిలోమీటరు దూరంతో అనుసరిస్తూ ముందుకు సాగుతుంది. అక్కడి నుంచి నేరుగా మెదక్ జిల్లా గజ్వేల్-సిద్దిపేట- కరీంనగర్ జిల్లా సిరిసిల్ల-వేములవాడ-బోయిన్‌పల్లి-కొత్తపల్లి వరకు కొనసాగి అక్కడ పెద్దపల్లి-జగిత్యాల లైనుతో అనుసంధానమవుతుంది. ప్రస్తుతం కరీంనగర్-నిజామాబాద్ లైను నిర్మాణంలో ఉంది. జగిత్యాల వరకు ఉన్న లైను మోర్తాడ్ వద్ద నిలిచిపోయింది. దాన్ని నిజామాబాద్‌కు కలిపే పనులు జరుగుతున్నందున ఆ లైనుతో ఈ కొత్త లైనును అనుసంధానిస్తున్నారు. వెరసి ఇటు కరీంనగర్‌తో నేరుగా లైను, అటు నిజామాబాద్‌తో మరో ప్రత్యామ్నాయ లైను హైదరాబాద్‌కు ఏర్పడినట్టవుతుంది.
 
చకచకా భూసేకరణ...
ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని రాష్ట్రప్రభుత్వం రైల్వేకు ఉచితంగా అందించనుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా పరిధిలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్‌వరకు 33 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయింది. మరో 60 కిలోమీటర్ల మేర సాగుతోంది.  మిగతాది కూడా వీలైనంత తొందరలో పూర్తిచేసి జూన్‌చివరి నాటికి దాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ భూమిని రైల్వేకు అప్పగించిన వెంటనే ప్రధాన ట్రాక్ నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. తొలుత వంతెనల నిర్మాణం చేపట్టాలని రైల్వే నిర్ణయించింది.

సిరిసిల్ల వద్ద మానేరుపై భారీ వంతెనతోపాటు మార్గం పొడవునా చిన్న, చిన్న వాగులపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులను ఆగస్టు తర్వాత మొదలుపెడతారు. వాటికి సీఎంతోపాటు రైల్వే శాఖ మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్ల క్రితం ప్రాజెక్టు అంచనా రూ.671.82 కోట్లు. తాజాగా రూ.1160 కోట్లు అవసరమని కొత్త అంచనా రూపొందించింది. 150 కిలోమీటర్ల మేర లైన్ కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement