కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం కాపునేతలు భారీగా ర్యాలీలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.
రాజోలులో కాపు నేతలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ముద్రగడను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన కాపులకు రిజర్వేషన్ల హామీను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెంలో మహిళలు ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
విశాఖలోని మున్సిపల్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం వద్ద ముద్రగడకు మద్దతుగా కాపు నేతలు ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ భేటీని పోలీసులు అడ్డుకుని కాపు నేతలను అరెస్ట్ చేశారు. రాజమండ్రి ఆస్పత్రిలో ముద్రగడ నాలుగో రోజు కూడా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. కాఆయనకు వైద్యానికి నిరాకరిస్తున్నారు.