పల్లెలెట్లా రగులుతున్నయంటే...
సాక్షి, రాజమహేంద్రవరం : ముద్రగడ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంతో నాలుగు రోజులుగా జిల్లాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయూరైంది. సెక్షన్ 144, 30 అమలు చేస్తూ వేలాదిమంది పోలీసులు మోహరించడం, రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం, శాంతిభద్రతల పేరుతో కాపు నేతల, ముద్రగడ అభిమానుల ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలు అధికమవడంతో కాపులు రగిలిపోతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని తమ నేత అడుగుతున్నారని, ఇందులో తప్పేంటని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు.
పట్టణాల్లో ఆందోళనకు దిగుతున్న నేతలు, యువకులను అరెస్టు చేసి, కేసుల పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో గ్రామాల్లో కాపు నేతలు, సాధారణ ప్రజలు, మహిళలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
రోడ్లపైకి వస్తున్న మహిళలు, ప్రజలు...
పి.గన్నవరం మండలం బోడపాటివారిపాలెం మహిళలు ఆదివారం తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నా సుమారు 1000 మంది మహిళలు తమ పిల్లలతో కలసి కంచాలపై చెంబులతో శబ్దం చేస్తూ పి.గన్నవరం మూడు రోడ్ల కూడలికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. లాఠీఛార్జి చేయడంతో పలువురు మహిళలు గాయపడ్డారు. దీంతో ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని సత్యవాడ, కొడుపూరు, ఊడిమూడి, సుందరపల్లి, పామర్రు గ్రామాల్లో ప్రజలు దీక్షలు చేశారు. కె.గంగవరంలో బంద్ నిర్వహించారు. ద్రాక్షారామలో ఆందోళన చేస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
చప్పిడివారి సావరంలో కాపు యువత నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపింది. రాజోలు నియోజకవర్గం మణికిపురం సెంటర్లో వందలాది మంది మానవహారం నిర్వంచారు. అనంతరం పోలీసు స్టేషన్ ముట్టడించారు. కాపులందరినీ అరె స్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల మనసు మారాలని పలువురు కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి, భద్రవరం గ్రామాల్లో మహిళలు ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు.
పెద్దాపురం మండలం పులిమేరులో 20 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. రాజానగరంలో ప్రజలు పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. ధవళేశ్వరంలో కంచాలు, గ్లాసులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బొమ్మూరులో కాపు యువత నిర్వహించిన శాంతి ర్యాలీలో జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. గొల్లప్రోలులో 200 మంది కాపునేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. గోకవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న అరెస్టులు...
వైఎస్సార్సీపీ పిఠాపురం కో ఆర్టినేటర్ పెండెం దొరబాబును, ముద్రగడ అనుచరుడు వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎం.అమ్మిరాజును, మండపేటలో కాపు సంఘం నాయకుడు కామన ప్రభాకరరావును అదుపులోకి తీసుకున్నారు.
ఆగిన గుండెలు...
ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళనతో ఆదివారం జిల్లాలో ఇద్దరు మర ణించారు. కిర్లంపూడిలో ముద్రగడ బంధువు దూము మామియలు(62) గుండెపోటుతో చనిపోయారు. యు.కొత్తపల్లిలో ముద్రగడకు మద్దతుగా భవిష్య కార్యాచరణపై చర్చ జరుగుతుండగా మేడిశెట్టి నూకరాజు(40)కు గుండెపోటుతో మరణిచారు.