కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం | Sakshi
Sakshi News home page

కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం

Published Tue, Dec 13 2016 11:34 PM

కందనవోలు సంబరాలను ఘనంగా నిర్వహిద్దాం - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): కందనవోలు సంబరాలను ఈనెల 28, 29 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ భవనంలో కందనవోలు సంబరాల నిర్వహణపై కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంబరాలను కర్నూలు జిల్లా యొక్క సాంస్కృతిక కళావైభవాన్ని, వారసత్వాన్ని ప్రతిబింబించేలా, జిల్లా ప్రత్యేకతలకు దర్పణం పట్టేలా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కర్నూలు గొప్పతనాన్ని చాటిచెప్పే సాంస్కృతిక సాహిత్య రంగాల వైభవం, నదుల ప్రాశస్త్యం, దేవాలయాల ప్రతిరూపాల ఏర్పాటు, రాయలసీమ తెలుగుదనం ఉట్టిపడేలా కళారూపాల ప్రదర్శన, భాషాభివృద్ధి, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన, వంటలు, చిరుధాన్యాల ప్రదర్శన తదితరాలను ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం నిర్వహించే సమావేశానికి ఈ అంశాలపై తగిన వివరాలతో హాజరు కావాలని కోరారు. అన్ని రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని సన్మానించాలన్నారు. రెండు రోజులు కర్నూలు విశిష్టతను వివరణాత్మకంగా తెలిపే ప్రయత్నం చేసి ప్రజల మన్ననలను పొందాలన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు వెంకటసుబ్బారెడ్డి, శశిదేవి, మల్లికార్జున తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement