నరేంద్రమోదీ తీరు నచ్చక ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు వదిలేసి వెళ్లిపోతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇగో ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు నచ్చక ఇప్పటికే అన్ని ప్రాంతీయ పార్టీలు వదిలేసి వెళ్లిపోతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగునాడు స్టూడెండ్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన ‘ప్రత్యేక హోదా నిజానిజాలు- ప్రతిపక్షాల కుట్రలు’ అంశంపై జరిగిన చర్చావేదికలో పాల్గొన్నారు.
జూపూడి మాట్లాడుతూ.. మోడీతో కలిసి ఉండటానికి వీల్లేదని శివసేన, అకాలీదళ్ వెళ్లిపోగా టీడీపీ మాత్రమే మిత్రధర్మం పాటిస్తోందన్నారు. బీజేపీ శత్రువైఖరిని అవలంభిస్తే మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనానంతరం బాధ్యత వహించాల్సిన బీజేపీ.. ప్రజల తిరస్కరణకు గురైన కాంగ్రెస్ పార్టీబాటలోనే పయనిస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాన్నే చేస్తే ఆ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు.
'ప్రత్యేకహోదాపై తిరుపతిలో మోదీ ప్రకటించారనే ఆయన్ను అమరావతికి పిలిచాం. అమరావతిలో తమను అవమానించిన మోదీ పార్లమెంట్‌లో అరుణ్‌జైట్లీ ద్వారా వినిపించిన విధానమేదైతే ఉందో అది నచ్చక సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు’ అని జూపూడి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా చేసిన వాగ్దానాలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ గెజిటెడ్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య, జేఏసీ ప్రధాన కార్యదర్శి వరలక్ష్మీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, జాతీయ నాయకులు ఎ.రాజేష్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.