‘సెస్‌’ అంతర్గత కలహాలు | internal disturbneses in cess | Sakshi
Sakshi News home page

‘సెస్‌’ అంతర్గత కలహాలు

Jul 29 2016 9:11 PM | Updated on Aug 20 2018 8:24 PM

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) పాలకవర్గ సమావేశం శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మెజారిటీ డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల ఆఫీస్‌లో పాలకవర్గ సమావేశం ప్రారంభమైంది.

  • పాలకవర్గ సమావేశానికి మెజారిటీ సభ్యుల డుమ్మా 
  • కొను‘గోల్‌మాల్‌’పై గుర్రు
  • ఒక్క డైరెక్టర్‌ను రప్పించేందుకు విఫలయత్నం 
  • చివరకు కోరమ్‌ లేక 16వ తేదీకి వాయిదా 
  • ‘సాక్షి’ కథనాలపై చర్చ
  • సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌) పాలకవర్గ సమావేశం శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మెజారిటీ డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి అధ్యక్షతన సిరిసిల్ల ఆఫీస్‌లో పాలకవర్గ సమావేశం ప్రారంభమైంది. 11 మంది డైరెక్టర్లున్న ‘సెస్‌’లో ఆరుగురు డైరెక్టర్లు ఉంటేనే పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశానికి ఐదుగురు డైరెక్టర్లు మాత్రమే హాజరు కావడంతో కోరమ్‌ లేక  సమావేశం వాయిదా పడింది. ఆగస్ట్‌ 16న మళ్లీ  నిర్వహించాలని చైర్మన్‌ లక్ష్మారెడ్డి నిర్ణయించారు.  
     
    కొను‘గోల్‌మాల్‌’పై అసంతృప్తి..
    సిరిసిల్ల ‘సెస్‌’ పరిధిలో 70 ట్రాన్స్‌ఫార్మర్లు, 1500 విద్యుత్‌ స్తంభాలు టెండర్లు లేకుండానే ఇటీవల కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు తీసుకుని కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. సంస్థ కొనుగోలు వ్యవహారాలపై ‘సాక్షి’లో వరస కథనాలు వచ్చాయి. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించకుండా కొనుగోలు చేయవద్దని కోరుతూ మెజారిటీ డైరెక్టర్లు ఇదివరకే ‘సెస్‌’ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందించారు. అయినా వాని అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పర్చేజ్‌ కమిటీ ఆమోదంతో కొనుగోళ్లు చేయడంపై డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి ఆరుగురు డైరెక్టర్లు దూరంగా ఉన్నట్లు తెలిసింది.
     
    ‘సాక్షి’ కథనాలపై చర్చ..
    ‘సెస్‌’లో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కొనుగోళ్లపై ‘సాక్షి’లో వరస కథనాలు వచ్చాయి. దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో పాలకవర్గ సభ్యులు చర్చించారు. సమావేశానికి హాజరైన వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్, పర్చేజ్‌ కమిటీ సభ్యులు కుంబాల మల్లారెడ్డి, దేవరకొండ తిరుపతి, ఏనుగు విజయరామారావు ‘సాక్షి’ కథనాలపై చర్చించారు. ఒక్క డైరెక్టర్‌ సమావేశానికి వస్తే.. కోరమ్‌ నిండేది. ఆ ఒక్క డైరెక్టర్‌ను సమావేశానికి రప్పించేందుకు వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ విఫలయత్నం చేసినట్లు తెలిసింది. కాగా, ఆరుగురు డైరెక్టర్లు సమావేశానికి రాక పోవడం చర్చనీయాంశమైంది. ‘సెస్‌’ డైరెక్టర్లు జడల శ్రీనివాస్, కొక్కు దేవేందర్‌యాదవ్, అల్లాడి రమేశ్, ఎ.లక్ష్మి, రామతీర్థపు రాజు, వెంకటరమణారెడ్డి పాలకవర్గ సమావేశానికి దూరంగా ఉన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంలో ‘సాక్షి’కి లీకేజీ ఇస్తున్నది ఎవరనే విషయమై కూడా సమావేశంలో చర్చించారు. మరోవైపు ‘సెస్‌’ వ్యవహరాలు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌కు ఎలా తెలుస్తున్నాయని పాలకవర్గ సభ్యులు ఆరా తీశారు. ఇకపై టెండర్లు లేకుండా ఏ వస్తువు కొనుగోలు చేయొద్దని సమావేశానికి హాజరైన డైరెక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. టెండర్లు లేకుండా కొనుగోలు చేయడంపై పాలకవర్గం బద్‌నాం అయినట్లు అంగీకరించడం విశేషం.  సిరిసిల్ల ప్రాంతంలో ‘సాక్షి’ వరస కథనాలు, పాలకవర్గ సమావేశానికి కోరమ్‌ లేక పోవడంతో వారి మధ్య ఉన్న అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీ డైరెక్టర్ల మధ్య కలహాలు  చర్చనీయాంశమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement