ఉరి వేసుకొని ఇంటర్‌ విద్యార్థిని మృతి | inter student hanged herself in college | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని ఇంటర్‌ విద్యార్థిని మృతి

Sep 3 2016 10:30 PM | Updated on Nov 6 2018 8:04 PM

కల్పన మృతదేహం - Sakshi

కల్పన మృతదేహం

విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించి వారి జీవితానికి పూలబాటలు వేయాల్సిన కళాశాలలు అందుకు భిన్నంగా తయారయ్యాయి.

గురజాడ కళాశాలలో సంఘటన
కడుపు నొప్పా! ప్రేమ వ్యవహారమా!
వివరాలు గోప్యంగా ఉంచిన యాజమాన్యం
 
విద్యార్థుల భవిష్యత్‌ను నిర్దేశించి వారి జీవితానికి పూలబాటలు వేయాల్సిన కళాశాలలు అందుకు భిన్నంగా తయారయ్యాయి. సరస్వతీ నిలయాలు విద్యార్థుల పాలిట మృత్యు కూపాలుగా మారుతున్నాయి. తమ చిన్నారి భవిష్యత్‌ దేదీప్యమానంగా వెలుగొందుతుందన్న కోటి ఆశలతో తల్లిదండ్రులు కళాశాలలకు పంపితే అక్కడ నుంచి భావి భారత పౌరులుగా రావాల్సిన వారు మృతదేహాలుగా వస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల రోదన చెప్పనలవి కానిదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణం వెనుక ఉన్న వాస్తవాలు తెరమరుగవుతున్నాయి. దీంతో తమ చిన్నారుల మరణానికి అసలు కారణం ఏంటో తెలియని విపత్కర పరిస్థితి తల్లిదండ్రులది. తాజాగా గురజాడ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కడుపునొప్పి తాళలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...
 
 
పాత శ్రీకాకుళం :  శ్రీకాకుళం రూరల్‌ మండలం మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషనల్‌ సోసైటీలో ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నక్కల కల్పన (18) కళాశాలలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శనివారం మృతి చెందింది. ఈమె మృతి వెనుక బలమైన కారణాలు ఉన్నప్పటికీ కళాశాల యాజమాన్యం వాస్తవాలను  గోప్యంగా ఉంచి కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందన్న వివరాలను మాత్రమే చెబుతోంది. సంతబొమ్మాళి మండలం తాళ్లవలసకు చెందిన కల్పన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కల్పన తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. అందులో కల్పనే పెద్దమ్మాయి. రోజూలాగే శుక్రవారం కుడా కళాశాలకు వెళ్లిన కల్పన అదే రోజు రాత్రి నుంచి నీరసంగా  కనిపించిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. మరుసటి రోజు శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో వార్డెన్‌ కుమారి హాస్టల్‌ గదిలో ఉన్న విద్యార్థినులను స్టడీ అవర్‌కు నిద్రలేపింది.  
 
తనకు తలనొప్పిగా ఉందని కాసేపు అయ్యాక స్టడీ అవర్‌కు వెళ్తానని కల్పన వార్డెన్‌కు చెప్పి బాత్‌రూంకు వెళ్లింది. దీంతో వార్డెన్‌ పది నిమిషాల్లో వస్తాను స్టడీ అవర్‌కు వెళ్లిపోవాలంటూ చెబుతూ ఆ పక్కనే మరో గదిలో ఉన్న సిక్‌తో ఉన్న విద్యార్థినుల వద్దకు వార్డెన్‌ వెళ్లిపోయింది. ఈలోగా కల్పన తన వేసుకున్న కళాశాల డ్రస్సుకు చెందిన చున్నీతోనే హాస్టల్‌ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాసేపు అయ్యాక అటుగా వచ్చిన వార్డెన్‌ కుమారి ఒక్కసారిగా చూసి ఆందోళనకు గురైంది. అప్పటికే కల్పన మృతి చెందింది. దీంతో విద్యార్థులంతా హాస్టల్‌ గదిలోకి పరుగులు తీశారు. వెంటనే విషయాన్ని బయటకు పొక్కకుండా చూసేందుకుగాను కళాశాల యాజమాన్యం కల్పన మృతదేహాన్ని నిమిషాలు వ్యవధిలోనే కిందకు దించేస్తూ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.  
 
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య 
కల్పన కడుపునొప్పి తాళలేకే ఆత్మహత్య చేసుకుందని తండ్రి అప్పారావు విలేకరులకు తెలిపారు. రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కూడా అలాగే కేసు నమోదు అయ్యింది. రూరల్‌ ఏఎస్‌ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
గోపికమ్మ పాటతో మంచి గుర్తింపు 
కల్పన మంచి డ్యాన్సరని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. గత ఏడాది ఫ్రెషర్స్‌డే నాడు కల్పన ముకుందా చిత్రంలోని ‘గోపికమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేసి మంచి గుర్తింపు పొందింది.  తోటి విద్యార్థినులతో ఎప్పుడూ చలాకీగా ఉండే కల్పన ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు. 
 
ప్రేమ వ్యవహారమా?
ఇదిలా ఉండగా కల్పన ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తన ప్రేమ వ్యవహారం ఇంట్లో వారికి తెలిసిపోవడంతో కల్పన  కుటుంబీకులు వేరే సంబంధాలు చూసినట్లు భోగట్టా. దీంతో మహూర్తాలు కుడా పెట్టుకున్నారని, ఈ విషయం కల్పనకు నచ్చక, ప్రేమను గెలిపించుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని గుసగుసలు విన్పిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement