ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు | heavy rains in chittoor,nellore districts | Sakshi
Sakshi News home page

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

May 18 2016 2:03 PM | Updated on Oct 20 2018 6:19 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బుధవారం వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది.

నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుసున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో బుధవారం వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది.

నెల్లూరు నగరంలో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు, తడ, ఆత్మకూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కృష్ణపట్నం పోర్టులో ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అధికారయంత్రాంగం పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పూతలపట్టు తదితర ప్రాంతాల్లో బారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవితానికి ఆటంకం కలిగింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది.

గుంటూరు జిల్లా అంతటా బుధవారం ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. తీరప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో నిజాంపట్నం హార్బర్‌లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సూర్యలంక బీచ్‌లో అలల ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లటం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement