క్రీడా‘కుసుమ’ం

క్రీడా‘కుసుమ’ం

–ప్రోత్సాహం ఉంటే ఒలింపిక్స్‌కు 

వీరవాసరం :

గ్రామీణ ప్రాంతం నుంచి అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికైంది రావాడ కుసుమ. వీరవాసరం గ్రామానికి చెందిన కుసుమ పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పాల్గొన్న ప్రతీ పోటీలోను పతకాలను చేతబడుతుంది. 2009 ఆగస్ట్‌ 16న అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏపీ స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఎంపికైంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఇంటిర్మిడియట్‌ మొదటి సంవత్సరం చదువుతూ క్రీడల్లోనూ రాణిస్తుంది. లాంగ్‌జంప్, హార్డిల్స్‌ పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ మేటి క్రీడాకారిణిగా గుర్తింపుతెచ్చుకుంటుంది.

తల్లి ప్రోత్సాహంతో 

ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే కుసుమ తండ్రి రావాడ అప్పారావు ఐదేళ్ల్ల క్రితం అనారోగ్యంతో మతి చెందాడు. కుసుమ అప్పుడు 7వ తరగతి చదువుతోంది. తల్లి దుర్గా ఆదిలక్ష్మి  వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమార్తె, కుమారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచుతోంది. 

సాధించిన పతకాలు 

క్రీడాకారిణిగా రావాడ కుసుమ ఎన్నో పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి 100కు పైగా పతకాలను సొంతం చేసుకుంది. 2013లో శ్రీకాకుళంలో జరిగిన 59వ ఇంటర్‌ డిస్ట్రిక్ట్స్‌ స్కూల్‌ గేమ్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ను, 2015లో కాకినాడలో జరిగిన 27వ సౌత్‌ జోన్‌ నేషనల్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ను, 2016లో కోజికోడ్‌ (కేరళ)లో జరిగిన 61వ జాతీయ స్కూల్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజత పతకం సాధించింది. ఇవే కాకుండా వికారాబాద్, రంగారెడ్డి, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ఇంటర్‌ డ్రిస్టిక్ట్స్‌ స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హార్డీల్స్‌లో ఎన్నో పతకాలు, ప్రశంసా పత్రాలను అందుకుంది. 

 

–ఒలింపిక్స్‌లో పతకం నా లక్ష్యం

 

ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. అథ్లెటిక్స్‌ కోచ్‌ ఆదిత్యవర్మ పర్యవేక్షణలో వివిధ పోటీల్లో రాణిస్తున్నాను. నా తల్లి దుర్గాఆదిలక్ష్మి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. ప్రోత్సాహం ఉంటే ఇంకా రాణించి దేశానికి ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. 

 

–ప్రోత్సాహం ఉంటే మరింత రాణిస్తుంది

 

నా కుమార్తె కుసుమకు ప్రోత్సాహం ఉంటే క్రీడల్లో మరింత రాణిస్తుంది. కూలీ నాలీ చేసుకుని జీవనం సాగించే నాబోటి వాళ్లు మెరుగైన శిక్షణ ఇప్పించడం ఆర్థికంగా  కష్టతరం. ప్రస్తుతం స్పోర్ట్స్‌ స్కూల్లో చదువుతుంది. ఇంటిర్మీడియట్‌ అనంతరం డిగ్రీ చదువును బయటే చదవాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా నాపై పెనుభారం పడుతుంది. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top