నేటినుంచి ఏదులాబాద్‌ జాతర

నేటినుంచి ఏదులాబాద్‌ జాతర - Sakshi


జాతరకు ముస్తాబైన శ్రీగోదాదేవి సమేత మన్నారు రంగనాయక స్వామి దేవాలయం



ఘట్‌కేసర్‌: మండలంలోని ఏదులాబాద్‌ గ్రామంలో శ్రీగోదాదేవి సమేత శ్రీమన్నారు రంగ నాయక స్వామి జాతర ఈనెల 2 నుంచి 9 తేదివరకు నిర్వహించనున్నారు. దేవాలయం సుమారు 450 సంవత్సరాల  పూర్వం  నిర్మించారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా, ఎందరికో కొంగు బంగారంగా, ఇంటి ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నారు.ముడుపు కడితే కోరిక తీరినట్టేనని స్థానిక ప్రజలు భావిస్తారు. దేవాలయంలోని  అండాళమ్మవారిని గాజులమ్మ అని పిలుస్తారు.



         పచ్చని పంటపొలాలు, సమీపంలో పెద్ద చెరువు,  పెద్ద పుష్కరిణి సమీపంలో దేవాలయం ఎత్తైన గోపురం, అద్దాల మేడ, విశాలమైన  ఆవరణ,  ఎత్తైన మండపం,  ర«థం , పుష్కరిణి భక్తులను విశేషంగా అకర్షిస్తుంది. జాతర సమయంలో అధికసంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో  దేవాలయానికి  విచ్చేస్తు పూజల జరుపుతుంటారు. ఇక్కడ ప్రకతి రమణీయత, అందాలు  అందరిని ఆకట్టుకుంటుంది.తమిళ సంప్రాదాయం ప్రకారం పూజలు జరుగుతాయి.



దేవాలయ చరిత్ర

ద్రవిడ దేశంలోని తిరు ఇంద్ర పురంలోని అప్పల్‌కోవిల్, చిత్తల కోవిల్‌కు చెందిన అప్పల దేశికులు ఆ దేవాలయాన్ని నిర్మించారు. ఏదులాబాద్‌ గ్రామాన్ని గతంలో రాయలపురం అని పిలిచేవారు. శ్రీవల్లిపుత్రుడు అనే గ్రామానికి చెందిన అలివేళమ్మను తిరుఇంద్ర పురానికి ఇచ్చి పెండ్లి చేశారు, కొంత కాలానికి తల్లిదండ్రుల, సోదరులతో మనస్పార్ధలతో అప్పటికే భర్త  చనిపోయిఉండటంతో గర్భవతిగా ఉన్న అలివేళమ్మ  ద్రవిడ దేశం విడిచి  మండలంలోని రాయుని పురం (ఏదులాబాద్‌) చేరింది. అలివేళమ్మకు కొడుకు అప్పన్‌ జన్మించాడు. అప్పన్‌ పెరిగి పద్దవాడై కొంత కాలనికి గరుడాద్రిగా పిలిచే కొండకు వెళ్ళాడు. అది ప్రకతి  అందాలకు పరవశుడై కొంత సమయం అప్పన్‌ అక్కడే విశ్రమించాడు. అతని స్వప్నంలో దేవుడు కనించే అక్కడి తులసి చెట్టు ఉన్న  భూమిలో తాను విగ్రహ రూపంలో ఉన్నట్లు తెలియపరిచాడు. కాసేపటికి మేల్కోన్న అప్పన్‌ తులసి చెట్టు దగ్గర తవ్వగా శ్రీగోదాదేవి సమేత  మన్నారు రంగ నాయక స్వామి విగ్రహాలు కనిపించాయి. దానిని దేవాలయంగా నిర్మించారు.గోల్కొండ రాజ్యాన్ని పాలించిన మల్కిభరాముని కాలంలో దేవాలయం నిర్మించారు. అవిషయాన్ని అక్కడి శాసనాలు రుజువుచేస్తున్నాయి. గోదాదేవి మహాత్యానికి చెందిన ఎన్నో క«థలు ప్రచూర్యంలో ఉన్నాయి.



ఒకటి : ఒకనాడు గోదాదేవి ఓణి పరిఖినీ ధరించి యువతి వేశంలో గ్రామంలోకి వెళ్ళి గాజుల వాని ఇంటకి వెళ్ళి తనకు నచ్చిన గాజులు చేతుల నిండా వేయించుకుంది. గాజుల వాడు డబ్బులు అడిగితే తన తండ్రి దేవాలయం వద్ద ఉన్నాడని తానే డబ్బులు ఇస్తారని తెలిపింది. దానితో గాజుల వాడు మరుసటి రోజు అప్పన్‌ వారి ఇంటికి వెళ్ళి మీకూతురు నిన్న గాజులు వేసుకుంది. డబ్బులు మీరు ఇస్తారని చెప్పివెళ్లిందన్నాడు. అప్పుడు అప్పన్‌ తనకు కూతుళ్ళే లేరు గాజులు వేసుకోవడం ఏమిటి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. గాజులు వేసుకున్న యువతి ఇటు వైపే వెళ్ళిందని గాజుల వాడు గట్టిగా చెప్పారు. దానితో అప్పన్‌ ఇంటిని, పరిసరాల్లో, సమీపంలోని దేవాలయాన్ని అంతట వెతికారు. దేవాలయంలో గోదాదేవి అమ్మవారి విగ్రహం చేతికిగాజుల వాడు వేసిన గాజులు నిండుగా  కనిపించాయి. దానితో గాజుల వాడు, అప్పన్‌ అవాక్కయ్యారు. అమ్మేవారే యువతి వేశం ధరించి వచ్చి గాజులు వేసుకుందని భావించారు. ఇప్పటికి ఒక్కో రూపంలో అమ్మవారు దేవాలయం పరిసరాల్లో  కనిపిస్తూ ఉంటుందని అక్కడి భక్తుల నమ్మకం. అమ్మవారికి గాజులతో పూజలు చేస్తారు. కోరిన కోరికలు నేరవేరుతాయని భక్తులు నమ్ముతారు.



        కళ్యాణం, సంతానం, సౌభాగ్యం, ఆర్యోగం, ఉద్యోగం, పురోగతి కోసం అమ్మవారిని కొలిస్తే వేంటనే నెరవేరతాయి. దేవాలయంలో ప్రతి మాసం మొదటి ఆదివారం సుదర్శన హోమం నిర్వహిస్తారు. జాతరలోని ముఖ్యమైన కార్యక్రమాల్లో 5తేదిన శ్రీ అండాళ్‌ తిరునక్షత్రం, 6న శ్రీతిరుకళ్యాణం,7న విమానరథోత్సవం ఉంటాయని దేవాలయకమిటి వంశపారంపర్య ధర్మకర్తలు తిరువడందం పోరెతత్తి రమానుజచార్యుల, కృష్ణమాచార్యులు, అచ్యుతాచార్యులు, సేనాచార్యులు తెలిపారు.మిగితా రోజల్లో  ఆరోజుకు సంబంధించిన కార్యక్రమాలుంటాయన్నారు. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

సికింద్రాబాద్, నగరంలోని పలు ప్రాంతాల నుంచి  బస్సులు ఏదులాబాద్‌కు ఉన్నాయి.నగరం నుంచి పోచంపల్లి, ఎంకిర్యాల వెళ్లే బస్సులు సైతం ఏదులాబాద్‌ నుంచి ప్రయాణిస్తుంటాయి.నగరం నుంచి ఘట్‌కేసర్‌ మండల కేంద్రం చేరుకుంటే అక్కడి నుంచి ఆటోల సౌకర్యం ఉంది. జాతర సమయంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.















 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top