
మృగశిర.. రెట్టింపైన చేపల ధర
మృగశిర కార్తె ప్రారంభంలో చేపలు తినాలన్నది కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం.
♦ ఎక్కడ చూసినా జోరుగా విక్రయాలు
♦ ఎగబడి కొన్న ప్రజలు ఘనంగా మృగశిర పండగ
మృగశిర కార్తె ప్రారంభంలో చేపలు తినాలన్నది కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. ఈసారి ఈకార్తె బుధవారం నుంచి ప్రారంభం కావడంతో చేపల ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటి ధర రెట్టి రెట్టింపు ధరలతో విక్రయించినా ప్రజలు ఎగబడి మరీ కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు ఎండిపోవడంతో పట్టణాల నుంచి జలపుష్పాలను తెచ్చి మరీ విక్రయించారు. దీంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది.
పరిగి : మృగశిర పండగను బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మృగశిర పండగకు ప్రత్యేతగా చెప్పుకునే చేపలకు గిరాకీ విపరీతంగా పెరిగి పోవడంతో ధరలు సైతం ఆకాశాన్నంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటి ధర కిలో రూ.80 నుంచి రూ. 120 మధ్య పలికేది. అయితే బుధవారం మాత్రం వీటి ధరకు రెక్కలు వచ్చాయి. ఏకంగా రూ. 180 నుంచి రూ. 200లకు విక్రయించినా.. జనం కొనుగోలు చేయడం గమనార్హం.
గతంలో ఎగుమతి.. ఇప్పుడు దిగుమతి..
మృగశిర పండగకు రెండు మూడు రోజుల ముందే పరిగి ప్రాంతంలోని చెరువుల నుంచి చేపలు పట్టి పట్టణాలకు ఎగుమతి చేసే వారు. కానీ.. ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నియోజకవర్గంలోని పెద్ద పెద్ద చెరువులు సైతం అడుగంటాయి. దీంతో మృగశిర రోజున పట్టణాల నుంచి చేపలను తెచ్చి విక్రయించారు. దీంతో వీటి ధర రెండింతలు అయ్యింది.