మా నాన్న నన్ను అమ్మేయాలని చూస్తున్నాడు.. నాకు చదువుకోవాలని ఉంది.. నన్ను చదివిస్తే డాక్టర్ అవుతా..
గుంటూరు మెడికల్ :
‘మా నాన్న నన్ను అమ్మేయాలని చూస్తున్నాడు.. నాకు చదువుకోవాలని ఉంది.. నన్ను చదివిస్తే డాక్టర్ అవుతా.. నా విషయంలో అమ్మమ్మ నాన్నతో గొడవపడి శరీరం కాల్చుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది’ అంటూ ఓ బాలుడు ఆస్పత్రి అధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లికి చెందిన నాగమ్మ 20 రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. ఈ నెల 18న ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ యనమల రమేష్ ఆస్పత్రిలో శానిటేషన్‌ను తనిఖీలు చేస్తున్న సమయంలో గుండా హర్షిత్ అనే 11 ఏళ్ల బాలుడు కంటపడ్డాడు.
డాక్టర్ రమేష్‌ను చూడగానే ఆయన వద్దకు వచ్చి తన తండ్రి సత్యనారాయణ తనను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందువల్లే అమ్మమ్మ గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు రోదిస్తూ చెప్పాడు. శుక్రవారం సాయంత్రం ఆర్‌ఎంవో డాక్టర్ రమేష్ పిల్లవాడిని మంత్రి రావెల కిషోర్‌బాబు వద్దకు తీసుకొచ్చి పరిస్థితి వివరించారు బాలుడిని ఆదుకోవాలని ఆయన మంత్రిని కోరారు. బాలుడు హర్షిత్ కూడా తనకు చదువుకోవాలని ఉందనే విషయాన్ని మంత్రికి తెలియజేయడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బాలుడిని చదివించేందుకు తాను సహకారం అందిస్తానని మంత్రి రావెల హామీ ఇచ్చారు.