ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను సూచించారు.
► నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
► అధికారులకు కలెక్టర్ కోనశశిధర్ హెచ్చరిక
గుంటూరు వెస్ట్: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను సూచించారు. ఈ విషయంలో అధికారుల అలసత్వం ఎక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం చిన్న పరిశ్రమలు పెట్టేందుకు యువత ఆసక్తిని చూపుతున్నారన్నారు. వారిని గుర్తించి ప్రోత్సహిస్తే ఎందరికో ఉపాధి చూపిస్తారని పేర్కొన్నారు. యువత పరిశ్రమల కోసం చేసుకున్న దరఖాస్తుల్లో లోపాలు ఉంటే అవి అధికారులే సరిదిద్దాలన్నారు.
పదే పదే వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటే ఇబ్బంది పడతారని అధికారులను హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన వారికి ఏకగవాక్ష విధానంలో వీలైనంత త్వరగా లైసెన్స్‌లు మంజూరు చేయాలన్నారు. అప్పుడే మిగతా వారికి ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. పరిశ్రమ స్థాపించే వారికి వచ్చే సబ్సిడీ, రుణాలు, ప్రోత్సాహకాలు ఇతర ఉపయోగాలను అభ్యర్థులకు అర్థమయ్యేట్లు వివరించాలన్నారు. అధికారులు మాట్లాడుతూ గత సమావేశం నుంచి ఇప్పటి వరకు 116 దరఖాస్తులు వచ్చాయన్నారు.
వీటిలో 96 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయన్నారు. ఇన్సెంటివ్స్ కింద 714లు రాగా, వాటిలో 544 మంజూరు కోసం పంపించామన్నారు. మిగిలినవి వివిధ కారణాల వల్ల తిరస్కరించామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మళ్ళీ వచ్చే సమావేశానికల్లా ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 ముంగా వెంకటేశ్శరరావు, పరిశ్రమల శాఖ జీఎం అజయ్‌కుమార్, ఎల్‌డీఎం.సుదర్శనరావు,అధికారులు పాల్గొన్నారు.
భూములివ్వని వారికి అవగాహన కల్పించండి: కలెక్టర్
గుంటూరు వెస్ట్: రాజధాని నిర్మాణం కోసం భూములివ్వని గ్రామాల ప్రజలకు అధికారులు అవగాహన కల్పించి, ఒప్పించాలని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో సీఆర్‌డీఏ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని కొండమరాజుపాలెం, లింగాయపాలెం, పెనుమాక గ్రామ ప్రజలు భూమిలిచ్చేందుకు సుముఖత చూపడం లేదన్నారు. కేవలం అవగాహనా రాహిత్యం వల్లే వీరు భూములివ్వడం లేదన్నారు. 2013 చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. పలుగ్రామాల నుంచి వచ్చిన కమిటీ సభ్యులతోనూ కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ క్రితికా శుక్ల, ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.