వారంలోగా స్కాలర్‌షిప్స్ పంపిణీ | Distribution of scholarships by the week | Sakshi
Sakshi News home page

వారంలోగా స్కాలర్‌షిప్స్ పంపిణీ

Nov 2 2015 12:33 AM | Updated on Aug 29 2018 7:45 PM

వారంలోగా స్కాలర్‌షిప్స్ పంపిణీ - Sakshi

వారంలోగా స్కాలర్‌షిప్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్స్ పంపిణీకి రంగం సిద్ధమైందని, వారంలోగా పంపిణీ చేస్తామని ఏపీ సాంఘిక,

♦ ఏపీ, తెలంగాణలో ఉపకార వేతనాల పంపిణీకి రంగం సిద్ధం
♦ 2013-14కి మినిట్స్ ఆధారంగా ఒప్పందం: ఏపీ మంత్రి రావెల
 
 కొరిటెపాడు (గుంటూరు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్స్ పంపిణీకి రంగం సిద్ధమైందని, వారంలోగా పంపిణీ చేస్తామని ఏపీ సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. గుంటూరులోని టీడీపీ ఆఫీసులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యార్థుల స్కాలర్‌షిప్స్ విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయని, దీంతో ఎంతో మంది  ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు స్థిరపడ్డవారే స్థానికులు అంటూ పేర్కొన్న దానిపై ఏపీ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడి విద్యార్థుల భవిష్యత్తును కాపాడిందన్నారు. తెలంగాణకు, ఏపీకి కామన్ డేటా ఉందని, ఈ-పాస్ విధానాన్ని అమలు చేయటానికి కూడా వారు సహకరించలేదన్నారు. ప్రస్తుతం 2013-14 సంవత్సరానికి జనాభా నిష్పత్తి ప్రకారం మినిట్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 52 శాతం, తెలంగాణ ప్రభుత్వం 48 శాతం స్కాలర్‌షిప్స్ పంపిణీ చేయటానికి అంగీకారం కుదిరిందని వెల్లడించారు.

 ఆర్టికల్ 371(డి) ప్రకారమే..
 ఆర్టికల్ 371(డి) ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు అక్కడ రిజిష్టర్ చేసుకోవాలని, కానీ ఇక్కడి వారే వెరిఫై చేసి స్కాలర్‌షిప్స్ పంపిణీ చేస్తారన్నారు. ఏపీలో కలిపిన 7 ముంపు మండలాలకు చెందిన విద్యార్థులకు కూడా 52:48 నిష్పత్తి వర్తిస్తుందన్నారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారం రోజుల్లో స్కాలర్‌షిప్స్ పంపిణీ ఉంటుందన్నారు.  సమావేశంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, వట్టికూటి హర్షవర్ధన్, షేక్ లాల్‌వజీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement