పైకప్పు.. తప్పదు అప్పు | Construction workers Looting in Indiramma houses | Sakshi
Sakshi News home page

పైకప్పు.. తప్పదు అప్పు

Jun 28 2026 4:18 AM | Updated on Jun 28 2026 4:18 AM

Construction workers Looting in Indiramma houses

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మేస్త్రీల మాయాజాలం 

తమ బిల్లులు పెంచుకోవడానికి అవసరానికి మించి పైకప్పుల నిర్మాణం

65% పైకప్పు నిర్మాణానికే ఖర్చవుతున్న వైనం 

తనిఖీల్లో వెల్లడి 

పైకప్పు పరిమితిని ఖరారు చేస్తూ సర్కారు ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల క్షేత్రస్థాయి తనిఖీకి ఇటీవల వెళ్లిన అధికారులు ఓ ఇంటి పైకప్పును చూసి అవాక్కయ్యారు. ఆ ఇల్లు 600 చదరపు అడుగుల గరిష్ట విస్తీర్ణానికే పరిమితమైనప్పటికీ పైకప్పు మాత్రం ఏకంగా 1,300 చ.అ. విస్తీర్ణంలో నిర్మితమైంది. అంత విశాలమైన పైకప్పు ఎందుకు నిర్మించారని లబ్ధిదారును ప్రశ్నించగా మేస్త్రీనే అలా కట్టాలన్నాడని చెప్పారు. మేస్త్రీలు పైకప్పు నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.250 నుంచి రూ.300 వరకు బిల్లు వేస్తున్నారు. ఈ లెక్కన కేవలం పైకప్పు నిర్మాణానికే ఏకంగా రూ. 3.25 లక్షలకుపైగా ఖర్చవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం రూ. 5 లక్షల్లో 65 శాతం కేవలం పైకప్పునకే ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇలా ఈ ఒక్క ఇల్లే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మేస్త్రీలు తమ బిల్లులు పెంచుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆటలాడుకుంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇంటి పైకప్పుల విస్తీర్ణాన్ని పెంచేసి నిర్మిస్తున్నారు. ఇలాంటి ఇళ్ల సంఖ్య భారీగా ఉందని తేలడంతో ఇకపై ఎవరూ ఇళ్ల పైకప్పులను ఎడాపెడా పెంచకుండా నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

ఇక గరిష్టంగా 750 చదరపు అడుగులు.. 
ఇందిరమ్మ ఇళ్ల పైకప్పును గరిష్టంగా 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మించాలని ప్రభుత్వం ఖరారు చేసింది. ఇప్పటివరకు ఇంటి విస్తీర్ణం (ప్లింత్‌ ఏరియా) 400–600 చ.అ.ల మధ్య ఉండాలన్న నిబంధన ఉంది. కానీ పైకప్పు విషయంలో ఎలాంటి పరిమితి లేదు. ఇప్పుడు దానికి కూడా ప్రభుత్వం పరిమితి విధించింది. ఇక నుంచి 400 చ.అ. విస్తీర్ణంలో ఉండే ఇంటికి గరిష్టంగా 500 చ.అ.లు, 500–600 చ.అ. వరకు ఉండే ఇంటికి గరిష్టంగా 750 చ.అ. మేర మాత్రమే పైకప్పు ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పైకప్పు ఉంటే దాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిగా భావించి బిల్లుల చెల్లింపును నిలిపేయనున్నారు. ఈ మేరకు ఇంటి పైకప్పుపై పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

లబ్ధిదారులకు ప్రభుత్వం సూచనలు... 
మేస్త్రీలు తమ బిల్లులు పెంచుకోవడానికి పైకప్పులను అవసరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తూ కిటికీలపై రక్షణ, నీడ కోసమని, ఇంటి ముందు భాగంలో పోర్టికో కోసమని లబ్ధిదారులను తప్పుదారి పట్టిస్తున్నారు. అలా నిర్మించాలేమోనన్న అమాయకత్వంతో లబ్ధిదారులు కాదనడం లేదు. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ వ్యయం పెరిగి వారి జేబు గుల్లవుతోంది. తాజాగా ప్రభుత్వం లబ్ధిదారులకు పలు సూచనలు చేసింది. కిటికీలపై వర్షం నీళ్లు రాకుండా, నీడ కోసం ఇంటి పైకప్పును పెంచుకోకుండా... అంతమేర సజ్జా నిర్మించుకోవాలని, ఇంటి ముందు పోర్టికోగా పైకప్పును విస్తరించకుండా... రేకుల లాంటి తాత్కాలిక మెటీరియల్‌తో అవసరమైన మేర నిర్మించుకోవాలని సూచించింది. 

అవగాహన కల్పించకపోవడంతోనే... 
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రభుత్వం ఖరారు చేసిన విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకుంటే అంతకుమించి ఖర్చు కాదన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ విషయంలో లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో చాలా మంది గరిష్ట పరిమితి 600 చ.అ.కు మించి ఇళ్లను నిర్మించుకున్నారు. దీంతో వారికి బిల్లుల విడుదల ఇబ్బందిగా మారింది. ఇప్పటికీ చాలా మంది బిల్లులు అందక ఇంటి నిర్మాణాన్ని నిలిపేసుకున్నారు. ఇక ఇంటి విస్తీర్ణం ఎంత ఉండాలన్న విషయంలో పరిమితులున్నా పైకప్పు విషయంలో లేదు. దీంతో భవిష్యత్తులో అవసరమైతే ఇంటిని విస్తరించుకునే వెసులుబాటు కలుగుతుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులు ఇళ్ల పైకప్పును ఎక్కువ పరిధిలో నిర్మించుకుంటున్నారు. ఇరుగుపొరుగు, బంధువులు, మేస్త్రీల మాటలు నమ్మి ఇలా చేస్తున్నారు. చివరకు ప్రభుత్వం ఇచ్చే బిల్లుల మొత్తం సరిపోక అప్పులు చేయాల్సి వస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement