breaking news
Indiramma Houses structures
-
ఇందిరమ్మ అక్రమార్కుల సంఖ్య 109 మంది
సాక్షి, మంచిర్యాల : ఎట్టకేలకు.. సీఐడీ జిల్లాలో ఇందిర మ్మ ఇళ్ల అక్రమార్కుల నిగ్గు తేల్చింది. తొలి విడతగా ఈ ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఆసిఫాబాద్ మండలం బాబాపూర్, తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం), కిష్టాపూర్ (రెబ్బెన), గిన్నెర (ఇంద్రవెల్లి) గ్రామాల్లో విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 109 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. వారి పేర్లతో కూడిన జాబితాను రెండ్రోజుల క్రితమే ప్రభుత్వానికి సమర్పించారు. తొలి విడతగా.. 30 మంది అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన అక్రమార్కుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు ఈనెల 11న సీఐడీ వరంగల్ రీజినల్ కార్యాలయానికి విచ్చేసి.. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వివరణకు విచ్చేసిన అధికారులు, సిబ్బంది నుంచి 2004-14 మద్య కాలంలో ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు..? ఎప్పుడు రిలీవ్ అయ్యారు..? సర్వీసు రికార్డుల ప్రకారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఇచ్చిన వివరణను బట్టి తొలి విడతలో మొత్తం 109 మంది అక్రమార్కులను గుర్తించారు. వీరిలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీఏలు, గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు దళారులు సైతం ఉన్నారు. ఇందిరమ్మ అక్రమార్కుల విషయంలో సీరియస్గా ఉన్న ప్రభుత్వం వీరి పట్ల ఎలా వ్యవహరిస్తుందోననే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. సంబంధిత అధికారులు మాత్రం అక్రమార్కులకు జైలు శిక్ష తప్పదని అభిప్రాయపడుతున్నారు. అక్రమాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా దళారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విచారణ ఇలా.. సీఐడీ అధికారులు 2004-14 వరకు మంజూరైన ఇళ్లు.. లబ్ధిదారులపై విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన నాలుగు గ్రామాల్లో 2,894 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. వాటిలో 963 ఇళ్లలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. రూ.2 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని అంచనా వేశారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.48 లక్షలు ఇవ్వకుండా కాజేసిన విలేజ్ ఆర్గనైజర్ల వివరాలు సీఐడీ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. మొదలు కాజేసిన నిధులు రికవరీ చేసి.. తర్వాత వీరిపై చర్యలు తీసుకుంటారు. గల్లంతైన 176 ఇందిరమ్మ ఇళ్లు ఎవరు కాజేశారు..? అందులో ఎవరెవరి ప్రమేయం ఉందో వివరాలు తెలుసుకున్న సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ అక్రమార్కుల విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉందని విచారణాధికారి సీఐడీ డీఎస్పీ రవికుమార్ చె ప్పారు. ఇళ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారులకు పూర్తి బిల్లు మంజూరు చేసిన.. క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు పడే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండు విడుతకు సన్నద్ధం.. మూడు నెలల పాటు తొలి విడత విచారణ చేపట్టి.. ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చిన సీఐడీ అధికారులు రెండో విడుత విచారణకు సన్నద్ధమవుతున్నారు. చెన్నూరు, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆదిలాబాద్ మండలాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అంచనా వేసిన సీఐడీ అధికారులు ఈ మండలాల పేర్లను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. రెండో విడుత విచారణ ఎక్కడ చేపట్టాలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతే దర్యాప్తు చేపడతామని సీఐడీ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. తొలి విడతలో సీఐడీ బృందాలకు హౌసింగ్ సిబ్బంది సహకారం అందినా.. రెండో విడతలో మాత్రం అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు విచారణకు అంతరాయం కలగకుండా తమదైన శైలిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే.. విచారణ కోసం మరింత మంది సిబ్బంది సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరోపక్క.. రెండో విడత విచారణ ఎక్కడ జరుగుతుందోనని జిల్లాలో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. -
గుట్టు రట్టయ్యేనా..?
- గద్వాలలో ఇందిరమ్మ ఇళ్లల్లో భారీగా అక్రమాలు - సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - మాజీ కౌన్సిలర్లే సూత్రధారులని ఆరోపణలు - గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు శూన్యం గద్వాల: గద్వాల పట్టణంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలు భారీగా చోటుచేసుకున్నాయి. పేదల సొమ్మును కొందరు అక్రమార్కులు దర్జాగా మెక్కేశారు. గతంలో గుర్తించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోగా.. ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ గృహనిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 2004 నుంచి 2014 వరకు గద్వాల పట్టణానికి సుమారు 2005 పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో పిల్లగుండ్ల ఇందిరమ్మ కాలనీకి 200 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే పట్టణంలో 80 శాతం ఇళ్లు పూర్తయినట్లు గృహనిర్మాణశాఖ లెక్కలు చెబుతున్నాయి. కానీ అందులో 30 శాతం ఇళ్లు కూడా పూర్తికాలేదన్నది వాస్తవం. పట్టణంలో ఒకరి పేర రెండు, మూడిళ్లు మంజూరయ్యాయి. ఒకే ఇళ్లుపై అనేకమార్లు బిల్లులు తీసుకున్నట్లు కూడా తేలింది. నిర్మాణాలు జరగకుండానే పట్టణంలోని కొందరు మాజీ కౌన్సిలర్ల చేతుల్లోకి దాదాపు రూ.2కోట్ల మేర ప్రజాధనం వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. మం జూరైన ఇళ్ల నిర్మాణాల చెల్లింపులు, లబ్ధిదారుల ఎంపిక తదితర స్థాయిలో గత మూడేళ్ల క్రితం సదరు వ్యక్తులు పెద్దఎత్తున లాబీయింగ్ చేయడంతో అక్రమాలు కోట్లు దాటాయి. ఈ క్రమంలో 2008లో జరిగిన విచారణ మధ్యలోనే ఆగిపోయింది. 2009లో అప్పటి ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్లల్లో జరిగిన అక్రమాలపై థర్డ్ పార్టీ విచారణకు ఆదేశించింది. అక్రమాల నిగ్గుతేల్చకుండానే అధికారులు ఫైళ్లను మూలకుపడేశారు. అధికారుల విచారణకు సహకరించని పీడీ కార్యాలయం గద్వాల పట్టణంలో మూడేళ్ల క్రితం థర్డ్ పార్టీ విచారణ జరిగింది. అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రూ.28లక్షల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. చాలా ఇళ్లు లబ్ధిదారుల పేర్లు కాకుండా మరో వ్యక్తి పేరుతో ఫొటోలు మార్చి రుణాలు పొందారని తేల్చారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గంలోని ధరూరు, గట్టు, మల్దకల్, గద్వాల మండలాల్లో అధికారుల బృందాలు ఇందిరమ్మ అక్రమాలపై సర్వేలు నిర్వహించి తుది నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించారు. హౌసింగ్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా... 2011 మార్చి 14న హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు జిల్లా హౌసింగ్ అధికారులు గద్వాల ఇందిరమ్మ ఇంటిదొంగలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గద్వాల హౌసింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలను సమగ్రంగా అందిస్తేనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అప్పట్లో పట్టణ ఎస్ఐ, సీఐలు హౌసింగ్ డీఈఈకి తేల్చిచెప్పారు. థర్డ్ పార్టీ విచారణ వివరాలు అందించాలని డీఈఈ జిల్లా హౌసింగ్ పీడీ కార్యాలయానికి లేఖరాసినా ఇంతవరకు సమాధానం రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించడంతో గద్వాల పట్టణంలో ఆసక్తి నెలకొంది.