సెక్యూరిటీ గార్డ్‌పై కానిస్టేబుల్ దాడి?
కడప నగరం ఎర్రముక్కపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్ సెక్యూరిటీ గార్డుపై ఏఆర్ కానిస్టేబుల్ శనివారం దాడి చేసినట్లు తెలిసింది.
కడప ఎడ్యుకేషన్: కడప నగరం ఎర్రముక్కపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్ సెక్యూరిటీ గార్డుపై ఏఆర్ కానిస్టేబుల్ శనివారం దాడి చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు బ్యాంకులో అన్ని కౌంటర్ల వద్ద వేచి ఉండటంతోపాటు బయట ప్రాంతంలో క్యూలో నిలిచొని ఉన్నారు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలు ఉన్న క్యూలో వెళ్లాడని, బ్యాంకు సెక్యూరిటీ గార్డు జగన్నాథరెడ్డి వెనక్కు లాగారు. దీంతో కానిస్టేబుల్ తనపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేశారని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. బ్యాంకు సిబ్బంది తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇలా బ్యాంకుకు డబ్బు కోసం వచ్చే వాళ్లు దాడులు చేస్తే తాము విధులు నిర్వహించలేమని ఇన్‌చార్జి మేనేజర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కడప డీఎస్పీ అశోక్‌కుమార్, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, తాలుకా, చిన్నచౌక్ ఎస్‌ఐలు రాజరాజేశ్వరెడ్డి, యోగీంద్ర అక్కడికి చేరుకుని, ఇద్దరిని విచారణ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సెక్యూరిటీ గార్డు మాట్లాడుతూ మహిళల క్యూలో వెళ్లకూడదని, వెనక్కు రావాలని చెప్పడంతో, అందరి ముందు తనపై దాడి చేశాడని తెలిపారు. కానిస్టేబుల్ మాట్లాడుతూ తన కంటే మందు చాలా మంది పురుషులు ఉన్నారని, తనను మాత్రమే వెనక్కు లాగాడని పేర్కొన్నారు. తాను దాడి చేయలేదని, కేవలం తోశానని చెప్పారు. పోలీస్ అధికారులు, బ్యాంకు మేనేజర్ జోక్యం చేసుకుని.. ఉద్యోగులందరం సమన్వయంతో వెళ్లాలని, వారిద్దరి మధ్య సర్దుబాటు చేశారు. తర్వాత సిబ్బంది విధులను యథావిధిగా నిర్వహించారు.


