టీడీపీ ఏజెంట్‌గా మారిన కలెక్టర్‌

టీడీపీ ఏజెంట్‌గా మారిన కలెక్టర్‌ - Sakshi

 నేడు సామాజిక హక్కుల వేదిక ధర్నా 

– బీచ్‌లవ్‌ ఫెస్ట్‌వల్‌ నిర్వహిస్తే ప్రత్యక్ష ఆందోళన చేస్తాం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

 

కల్లూరు (రూరల్‌): టీడీపీ ఏజెంట్‌గా జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ విజయమోహన్‌ మారారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం కనిష్క హోటల్‌లో సామాజిక హక్కుల వేదిక (బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఫోరం) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే కరువు మండలాల జాబితాలో చోటివ్వలేదన్నారు. నవంబర్‌ దాటిపోతున్నా కేంద్రానికి కరువు నివేదికలు ఎందుకు పంపలేదని జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. 

 

అత్యంత ధనవంతుడు మంత్రి నారాయణ

భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్‌ రంగాన్ని నెత్తిన బెట్టుకుని తిరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు. విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేట్‌కు అప్పజెప్పిందని, దీంతో కార్పొరేట్‌ రంగంలో దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడైన మంత్రి ఎవరంటే నారాయణ అని తేలిందన్నారు. రూ.490 కోట్లను ఆస్తులను ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావును పక్కనబెట్టుకుని పెళ్లికొడుకులను మేపినట్లు మేపుతున్నారని ఆరోపించారు. 

 

ప్రత్యక్ష ఆందోళన..

రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో బీచ్‌లవ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోందని.. దీనికి 60 దేశాల నుంచి విదేశీ ప్రేమికులను రప్పిస్తున్నారని..ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు కాకుండా నారా లోకేష్‌తో చేయిస్తే నష్టం ఏంటని రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఆదాయం కోసం ఏ పనైనా చేస్తాం అని చెప్పుకోవడం మంచి పద్ధతి  కాదన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ప్రత్యక్షంగా ఆందోళన చేస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కె. రామాంజనేయులు, ఎస్‌ఎన్‌ రసూల్, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ కె. జగన్నాథం, వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్,  ఎల్‌హెచ్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌ నాయక్, కురువ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ పుల్లన్న, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు శేషఫణి, సోమసుందరం, లెనిన్, చంద్రశేఖర్, శ్రీనివాసులు, లక్ష్మీనరసింహ, భరత్‌కుమార్, తూర్పాటి మనోహర్‌ పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top