బాల్య వివాహం.. రిసెప్షన్‌కు బ్రేక్‌ | Child marriage break at the reception .. | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం.. రిసెప్షన్‌కు బ్రేక్‌

Mar 9 2017 10:20 PM | Updated on Sep 5 2017 5:38 AM

బాల్య వివాహం.. రిసెప్షన్‌కు బ్రేక్‌

బాల్య వివాహం.. రిసెప్షన్‌కు బ్రేక్‌

కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక‌్షన్‌ హాల్‌లో బాల్య వివాహం జరిగింది.

సంగారెడ్డి టౌన్, కొండాపూర్‌: కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ చౌరస్తాలోని ఓ ఫంక‌్షన్‌ హాల్‌లో బాల్య వివాహం జరిగింది. అయితే వీరి పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా ఆలస్యంగా అందిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. జిల్లా బాలల సంరక్షణ అ«ధికారి రత్నం కథనం మేరకు మల్కాపూర్‌ గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌ (24)కు వికారాబాద్‌ జిల్లా మోయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బాలిక(15 సంవత్సరాల ఆరు నెలల వయస్సు)తో రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. అనంతరం గురువారం (ఈనెల 9న) బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించకుండా బాల్‌రాజ్‌ రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అనంతరం మల్కాపూర్‌ పరిధిలోని రాయల్‌ ఫంక‌్షన్‌ హాల్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బాల్య వివాహం జరుగుతున్న విషయంపై జిల్లా కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌కు ఫిర్యాదు అందింది.

వెంటనే స్పందించిన కలెక్టర్‌ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని జిల్లా శిశు సంక్షేమాధికారి మోతిని ఆదేశించారు. ఈ మేరకు మోతి, జిల్లా బాలల సంరక్షణాధికారి రత్నం, కొండాపూర్‌ మండల తహసీల్దార్‌ శ్రీశైలం, ఎల్‌సీపీఓ అరుణ, స్థానిక పోలీస్‌ అధికారి బాలస్వామి ఫంక‌్షన్‌హాల్‌కు చేరుకున్నారు. బాల్య వివాహం చేసుకున్న పెళ్లి కొడుకు బాల్‌రాజ్, అతడి తల్లిదండ్రులు విఠల్, కిష్టమ్మలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రిసెప్షన్‌ జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు సంఘటనా స్థలంలో లేకపోవడంతో వారిని కేసు నుంచి మినహాయించినట్లు రత్నం తెలిపారు. బాల్య వివాహం చేసుకున్న బాలిక, ఆమె తల్లిదండ్రులకు ఐసీడీఎస్‌ జిల్లా కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. చట్టం ప్రకారం బాల్య వివాహం చేసుకుంటే విధించే శిక్ష, జరిగే పరిణామాలను అ«ధికారులు వివరించారు. అనంతరం బాలికను సంగారెడ్డి పట్టణంలోని బాల సదనంలో చేర్చారు. తర్వాత సీడబ్ల్యూసీ ఎదుట హాజరు పర్చనున్నామని రత్నం వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement