కావలిఅర్బన్: హౌసింగ్ రుణం(ఈపీఎఫ్) మంజూరుకు లంచం అడిగిన కడప ఈపీఎస్ కార్యాలయ ఆఫీస్ క్లర్క్ దానంను మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సోమవారం సీబీఐ అధికారులకు పట్టించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో మంగళవారం మున్సిపల్ యూనియన్ కార్యదర్శి మల్లి అంకయ్య, బి మాలకొండయ్య, ఎస్ బాలాజీలు విలేకరులకు వివరించారు.
సీబీఐ వలలో అవినీతి అధికారి
Jul 27 2016 5:04 PM | Updated on Sep 22 2018 8:22 PM
కావలిఅర్బన్: హౌసింగ్ రుణం(ఈపీఎఫ్) మంజూరుకు లంచం అడిగిన కడప ఈపీఎస్ కార్యాలయ ఆఫీస్ క్లర్క్ దానంను మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు సోమవారం సీబీఐ అధికారులకు పట్టించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలో మంగళవారం మున్సిపల్ యూనియన్ కార్యదర్శి మల్లి అంకయ్య, బి మాలకొండయ్య, ఎస్ బాలాజీలు విలేకరులకు వివరించారు. మే నెల 25న తాము మున్సిపల్ కార్మికులుగా హౌసింగ్ లోన్‌కు దరఖాస్తు చేసుకున్నామని, జూన్ 27న కడప ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి లోను గురించి అడిగామన్నారు. ఒక్కొక్కరు రూ.3 వేలు లంచం ఇస్తే రుణం మంజూరు చేస్తామని అడిగినట్లు తెలిపారు. లంచం ఇవ్వలేని తమ దరఖాస్తుల్లో లోపాలున్నాయని మున్సిపాలిటీకి పంపించారన్నారు. ఈనెల 24న లంచం ఇస్తామని చెప్పడంతో ఆఫీస్ క్లర్క్ పనిచేసిపెడతామని అంగీకరించాడు. సోమవారం ఇస్తామని ఆయనతో చెప్పామన్నారు. విశాఖ పట్నంలోని సీబీఐ ఎస్పీకి సమాచారం అందించామన్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ పూర్తి సహాయ సహకారాలతో లంచం అడిగిన అధికారిని పట్టించేందుకు పథకం వేశామన్నారు. విశాఖపట్నం నుంచి ముగ్గురు సీబీఐ సీఐలు, 7 మంది కానిస్టేబుళ్లు సోమవారం కావలికి వచ్చారన్నారు. కావలి నుంచి కడపకు అధికారుల వాహనాల్లో వెళ్లామన్నారు. పథకం ప్రకారం ఒక్కొక్కరికి రూ.3 వేలు చొప్పున లంచం ఇస్తామని తెలిపామన్నారు. సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో లంచం ఇస్తుండగా అతన్ని సీబీఐ అధికారులు పట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు డేగా సత్యనారాయణ, ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement