
షార్ కు చేరుకున్న కార్టోశాట్-2సీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ34 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ప్రయోగించనున్న 22 ఉపగ్రహాల్లో ప్రధానమైన 690 కిలోలు బరువైన కార్టోశాట్-2సీ ఉపగ్రహం ఆదివారం షార్‌కు చేరుకుంది. బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం (ఐసాక్) నుంచి దీన్ని భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన షార్‌కు తీసుకొచ్చి క్లీన్‌రూంలో ఉంచారు.
ఈ ప్రయోగంలో 22 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు రాకెట్ అనుసంధాన పనులను ఆదివారం నుంచి ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలన్నీ ఇక్కడికి చేరుకున్నాయి. నాలుగు దేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపనుండడంతో ఆయా దేశాల శాస్త్రవేత్తలు షార్‌లోనే ఉన్నారు. సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన సత్యభామశాట్, పుణే యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన స్వయంశాట్ షార్‌కు చేరుకోవాల్సి ఉంది.