బోగస్‌ పట్టభద్రులు | Bogus graduates | Sakshi
Sakshi News home page

బోగస్‌ పట్టభద్రులు

Published Thu, Feb 9 2017 9:54 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

Bogus graduates

- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతల గిమ్మిక్కు
- ఐటీఐ చేసిన వారినీ ఓటర్లుగా చేర్చిన వైనం
- ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా ఓటర్లుగా నమోదు
-జిల్లాలో ఇలాంటి వారు 8,500 మంది గుర్తింపు
 
రమేష్‌..కర్నూలులోని ఓ కళాశాలలో ఐటీఏ పూర్తి చేశారు.అతని సర్టిఫికెట్లు తీసుకొని అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు చేర్చారు. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు సమాచారం.
వెంకటేష్‌..సర్టిఫికెట్లు అన్నీ ఉన్నా జిరాక్స్‌ కాపీలపైన గజిటెడ్‌ అధికారి సంతకం లేదు. అయినా అధికారులు ఇతన్ని పట్టభద్రుల ఓటరుగా నమోదు చేశారు.
..జిల్లాలో ఇలాంటి వారు వేలల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిని గెలుపొందేందుకు టీడీపీ నేతలు నిబంధనలు తుంగలోకి తొక్కారు. తమకు అనుకూలమైన వారిని ఓటరు జాబితాలో చేర్చించారనే విమర్శలు ఉన్నాయి.  
 
కర్నూలు(అగ్రికల్చర్‌):
శాసనమండలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తన బోగస్‌ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టం అవుతోంది. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 84,754 మంది ఉన్నారు. ఇందులో 8,500 వరకు బోగస్‌ ఒటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనమండలి ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అభ్యర్థి ఓటమిపాలైతే పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. విజయాన్ని దక్కించుకునేందుకు బోగస్‌ ఓటర్లను భారీగా చేర్పించారు. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013 అక్టోబరు నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా 2014 నుంచి 2016 మధ్యన డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులను సైతం ఓటర్లుగా నమోదు చేయడం గమానార్హం. ఏదేని డిగ్రీ లేదా దాని సమాన పరీక్షలో ఉత్తీర్ణులయిన వారిని పట్టభద్రులుగా వ్యవహరిస్తారు. అయితే ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసిన వారిని సైతం ఓటర్లుగా నమోదు చేశారంటే అధికారపార్టీ నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో స్పష్టం అవుతోంది. ఓటకె నమోదులో అధికారులు విధిగా డిగ్రీ సర్టిఫికెట్లను పరిశీలించాలి. వాటి జిరాక్స్‌ కాపీలపై గజిటెడ్‌ అధికారి సంతకం ఉండాలి, కాని దరఖాస్తులకు ఎటువంటి సర్టిఫికెట్లు జతపరచకపోయినా ఓటర్లుగా నమోదు చేశారు. ఓటర్ల జాబితా తయారీలో మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతోంది.  
ఓటర్లు ఒక చోట పోలింగ్‌ కేంద్రం మరో చోట...
పట్టభద్రుల నియోజక వర్గానికి ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పట్టభద్రులకు 112 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరానికి చెందిన వారికి కర్నూలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే కర్నూలుకు చెందిన పట్టభద్రులకు పాణ్యంలో పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతేగాక 15 మందికి ఒకపోలింగ్‌ కేంద్రం.. 2500 మందికి ఒకే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం నాయకుల సూచనల మేరకు వారి ప్రయోజనం చేకూరే విధంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
సవరణలకు అవకాశం: విజయమోహన్‌, జిల్లా కలెక్టర్‌
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 20 వరకు అవకాశం ఉంది. బోగస్‌ ఓటర్లు ఎవరైనా ఉంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. వివరాలతో స్థానిక తహసీల్దార్లను, ఆర్డీఓలను సంప్రదిస్తే వారు కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement