నిర్మాణాలకు సిమెంట్‌ పోటు

గుంటూరులో నిలిచిన నిర్మాణం

పెరిగిన ధరలు..

ఆందోళనలో నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు

 

పాత గుంటూరు: పెరిగిన సిమెంట్‌ ధరల కారణంగా జిల్లాలో  నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. 20 రోజుల వ్యవధిలో సిమెంటు ధర పెరగడంతో భవన నిర్మాణ దారులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలు చేపట్టడం కష్టతరంగా ఉందని వాపోతున్నారు.  గతంలో రూ. 320లు ఉన్న సిమెంటు  బస్తా ధర, ప్రస్తుతం రూ. 360లకు చేరింది. ఈ ప్రభావం తమను నష్టాలకు గురిచేస్తుందని కాంట్రాక్టర్లు సైతం బెంబేలెత్తుతున్నారు. భవన యజమానులతో  తక్కువ ధరకు ఒప్పందాలు కుదుర్చుకొని పెరిగిన సిమెంట్‌ ధరల కారణంగా నిర్మాణాలు చేయలేక పోతున్నామని అంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా లక్ష టన్నుల వరకు 23 కంపెనీలకు చెందిన సిమెంటు అమ్మకాలు జరుగుతాయి. గుంటూరు నగరంలో ఉన్న 100 సిమెంటు దుకాణాల ద్వారా 30 వేల టన్నుల వరకు అమ్మకాలు జరుగుతాయని సమాచారం. గత ఆరు నెలలుగా సిమెంట్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఒకేసారి రూ.40 ధర పెరిగింది. సిమెంట్‌ ఉత్పత్తి లేదని చెప్పి సంస్థలు సరఫరా నిలిపివేయడంతోనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సిమెంటుకు డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉందని, ప్రస్తుతం వున్న రేటు ప్రకారం కొనుగోలు చేస్తేనే ఎగుమతి చేస్తామని  ఉత్పత్తి సంస్థలు అంటున్నాయని, అయితే అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మకాలు  కొనసాగించే  పరిస్థితి ప్రస్తుతం లేదని సిమెంటు డీలర్లు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలు దిగివచ్చేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

 

నష్టాల బాట పడుతున్నాం..

ఉత్పత్తి సంస్థలు సిమెంటు ధరలు పెంచడంతో అమ్మకాలు జరపలేకపోతున్నాం. పాత ధరలకే కొనుగోలు దారులకు సిమెంటును ఇవ్వాల్సి వస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి  నష్టాల బాట పడుతున్నాం.  

– అబ్దుల్‌ మదన్, సిమెంటు వ్యాపారి
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top