బీమా ముగిసింది.. దీమా చెదిరింది | beema close | Sakshi
Sakshi News home page

బీమా ముగిసింది.. దీమా చెదిరింది

Aug 3 2016 11:33 PM | Updated on Jul 11 2019 8:52 PM

అన్నదాతకు బీమాపై ధీమా లేకుండా పోతోంది. అతివృష్టి, అనాష్టి నుంచి గట్టెక్కించే సౌకర్యం దూరమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దీనిని కోల్పోతున్నారు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా రైతులు నష్టపోయారు.

 
–3 లక్షల మందిలో బీమా చేసింది 1.25 లక్షలే
–రెన్యువల్‌ ప్రక్రియ పూర్తికాకుండా ముగిసిన గడువు
సాక్షి, చిత్తూరు:
 అన్నదాతకు బీమాపై ధీమా లేకుండా పోతోంది. అతివృష్టి, అనాష్టి నుంచి గట్టెక్కించే సౌకర్యం దూరమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దీనిని కోల్పోతున్నారు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా రైతులు నష్టపోయారు.
 జిల్లాలో 6 లక్షలమందికి పైగా రైతులున్నారు. వీరిలో బ్యాంకుల ద్వారా 1,09,878 మంది రైతులు రుణాలు పొందారు. 16,451 మంది రైతులు నేరుగా బీమా చెల్లించారు. పంట రుణ ప్రక్రియ పూర్తి పూర్తికాక మునుపే బీమా గడువు ముగిసింది. దీంతో బీమా చెల్లించని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ కారణం చేతనైనా పంట సరిగా పండకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. బీమా గడువు పెంచాలని రైతు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా రైతులు చాలా వరకు నిరక్షరాస్యులే. బీమాపై వీరికి సరైన అవగాహన లేదు. ఈ విషయంలో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. గత ఏడాది పంట రుణాలు తీసుకున్న వారు తప్పితే ఈ ఏడాది పంటల బీమా చేయించుకున్నవారు తక్కువే. ఇది తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయలేదు. ఫలితంగా 3 లక్షల మందికిపైగా వేరుశనగ రైతులు నష్టపోయారు. 
 
ఎస్సీ,ఎస్టీ రైతులే అధికం
పంటల బీమా చెల్లించని వారిలో ఎస్సీ, ఎస్టీ రైతులే అధికంగా ఉన్నారు. కొన్ని బ్యాంకుల్లో వసతి లేమి, సిబ్బంది కొరత కారణంగా కూడా రైతులు బీమా సకాలంలో చెల్లించలేకపోయారు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాసినా బీమా చెల్లించలేకపోయామని అన్నదాతలు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా రెన్యువల్‌ ప్రక్రియ మందగమనంతో సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి కాక మునుపే బీమా గడువు ముగియడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. తప్పెవరిదైనా శిక్ష మాత్రం రైతులకే పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
ఫసల్‌ బీమాలో దక్కని చోటు
వేరుశనగకు ప్రధాని అట్టహాసంగా ప్రకటించిన ఫసల్‌ బీమాలోనూ చోటు దక్కలేదు. జిల్లాలో సుమారు లక్ష హెక్టార్లకు పైగా సాగయ్యే వేరుశనగకు ఫసల్‌ బీమా వర్తింపజేయలేదు. అతి తక్కువ  విస్తీర్ణంలో సాగయ్యే టమాటా లాంటి పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేయడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
 
గడువు పెంచాలి
బీమా చెల్లింపునకు గడువు తేదీ పెంచాలి. జిల్లాలో ఎక్కువ మంది రైతులు నిరక్ష్యరాస్యులే. వీరికి బీమాపై అవగాహన కల్పించాలి. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు మరింత నష్టపోతున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల పంట నష్టపోతే.. బీమా లేకపోవడం వల్ల రైతులు మరింత అప్పుల పాలవుతారు. బీమా గడువు పెంచకపోతే ఉద్యమిస్తాం. 
 సీవీవీ.ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement