పశుసంతపై ప్రభావం చూపేనా..? | beef ban effect on catle fair in adilabad | Sakshi
Sakshi News home page

పశుసంతపై ప్రభావం చూపేనా..?

May 30 2017 11:02 PM | Updated on Aug 17 2018 2:56 PM

పశుసంతపై ప్రభావం చూపేనా..? - Sakshi

పశుసంతపై ప్రభావం చూపేనా..?

కేంద్ర ప్రభుత్వం పశువుల విక్రయాలపై తీసుకున్న నిర్ణయం పశువుల సంతలపై ప్రభావం చూపనుంది.

► క్రయ, విక్రయాలపై గందరగోళం
► విక్రయానికి వేలాది పశువులు
► అమ్ముడుపోయిన వాటిలో 30శాతం కబేళాలకే..


ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర ప్రభుత్వం పశువుల విక్రయాలపై తీసుకున్న నిర్ణయం పశువుల సంతలపై ప్రభావం చూపనుంది. ఆదిలాబాద్‌ పట్టణంలో వారానికి రెండుసార్లు జరిగే పశువుల సంతలో వేలాది పశువుల క్రయ, విక్రయాలు సాగుతాయి. వీటిలో 30 శాతం వరకు పశువులు కబేళాలకే తరలుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత పర్యావరణ శాఖ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. జంతువుల విక్రయాలపై నిషేధం విధిస్తూ క్రూరత్వ నిరోధక చట్టం–2017ను తీసుకువచ్చింది.

దీంతో పశుసంతలు నిర్వహించే వ్యాపారులు గందరగోళానికి గు రవుతున్నారు. ఆవులు, గేదెలు, ఎద్దులను కబేళాల కోసం తరలించకూడదని, కేవలం వ్యవసాయ పనుల కోసమే విక్రయించుకోవాలంటూ ప్రభుత్వ జీవో తీసుకువచ్చింది. ఈ జీవో క్షేత్రస్థాయిలో అమలు చేయడం సాధ్యమేనా.. అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఆదిలాబాద్‌ పట్ట ణంలోని మార్కెట్‌యార్డ్‌లో ప్రతీ ఆది, సోమవారాల్లో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పశువుల అమ్మకాలు నామమాత్రంగా జరగనున్నాయని తెలుస్తోంది. ఈ సంతకు ఆదిలాబాద్, జైనథ్, బేల, తాంసి, తలమడుగు మండలాలకు చెందిన రైతులు విక్రయాలకు తీసుకువస్తారు. ఇక్కడి పశువులను ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కబేళాలకు తీసుకెళ్తారు.

విక్రయాలపై నిబంధనలెన్నో..
రైతులు పశువులను కొనుగోలు చేయాలన్నా.. వ్యాపారులు విక్రయించాలన్నా ఇకపై ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సిందే. జీవాలను కేవలం వ్యవసాయం కోసం ఉపయోగిస్తానని, కబేళాలకు పంపించబోనని సెల్ఫ్‌ డిక్లరేషన్, ఫొటో ధ్రువీకరణ, ఆరు నెలల వరకు కొన్న పశువును విక్రయించబోమని హామీ పత్రం ఇస్తేనే సదరు వ్యక్తికి పశువును అమ్మడానికి సాధ్యమవుతుంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా..
ఆదిలాబాద్‌ పట్టణంలో పేరుగాంచిన ఎడ్ల అంగడిపై ఈ నిషేదం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేస్తారనే ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా లేవని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు స్వాగతిస్తుండగా, మరికొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒక్క పశువును సంతలో విక్రయించాలంటే పశువు కొనుగోలు చేసే వ్యక్తి ఇచ్చే హామీ పత్రం, ఫొటో ధ్రువీకరణ, ఆరు మాసాల వరకు విక్రయించననే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తదితర పత్రాలను ఐదు సెట్లుగా జిరాక్స్‌ చేయించాలి. వాటి ప్రతుల్ని స్థానిక రెవెన్యూ అధికారి, పశువైద్యుడు, పశువుల మార్కెట్‌ కమిటీకి ఇవ్వడంతో పాటు అమ్మినవారు, కొన్నవారు ఒక్కో ప్రతిని భద్రపర్చుకోవాలనే నిబంధన సాధ్యదూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

30 శాతం కబేళాలకే..
ఆదిలాబాద్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో నిర్వహించే పశువుల సంత జిల్లాలోనే పెద్దదిగా చెప్పుకోవచ్చు. ప్రతీ ఆది, సోమవారాల్లో పశువుల సంతలో విక్రయాలు జరుగుతాయి. సుమారు 3వేల వరకు పశువుల క్రయ, విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. 50 శాతం వరకు విక్రయాలు జరిగితే అందులో నుంచి 30శాతం వరకు కబేళాలకు తరలుతున్నట్లు సమాచారం.

క్రయవిక్రయాలు కష్టమే..
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంతల్లో పశువులు కొనుగోలు చేయాలన్నా, విక్రయించాలన్నా కష్టతరంగా మారనుంది. మేత లేక ఇబ్బందులు తలెత్తినప్పుడు పశువుల కొనుగోళ్లు.. అమ్మకాలు స్తంభించిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అమలు చేసేందుకు ప్రత్యేక అధికార వర్గం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. విక్రయాలు తగ్గిపోవడంతో పశువుల మార్కెట్లు, సంతలకు వచ్చే ఆదాయం తగ్గిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement