రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయంపై మరో గందరగోళ నిర్ణయం. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అదనపు భవనాల టెండర్లను రద్దుచేస్తున్నట్లు ఏపీ సర్కారు శనివారం రాత్రి ప్రకటించింది.
విజయవాడ: రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయంపై మరో గందరగోళ నిర్ణయం. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం అదనపు భవనాల టెండర్లను రద్దుచేస్తున్నట్లు ఏపీ సర్కారు శనివారం రాత్రి ప్రకటించింది. అదే సమయంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో అద్దె భవనాల్లో హెచ్ వోడీల కార్యాలయాలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. జూన్ 27 నాటికి ఉద్యోగులందరినీ ఏపీ రాజధానికి తరలించాలని భీష్మించుకున్న బాబు సర్కార్.. అద్దె భవనాల్లో హెచ్ వోడీ, సిబ్బందికి కార్యాలయాలు ఏర్పాటుచేసి, ఇప్పటికే వెలగపూడిలో నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాలను గుర్తించామని, ఉద్యోగుల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు.
నిజానికి తాత్కాలిక సచివాలయ నిర్మాణం కంటే ముందే అద్దె భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ అంతలోనే మనసుమార్చుకుని ఎల్ ఎండ్ టీ సంస్థకు భారీ టెండర్లు కట్టబెట్టి వెలగపూడిలో తాత్కాలిక భవనాల పనులు ప్రారంభించారు. 45 ఎకరాల స్థలంలో నిర్మితం అవుతోన్న తాత్కాలిక భవనాలకుతోడు మరికొన్ని అదనపు భవనాలకూ టెండర్లు పిలిచారు. అయితే వెలగపూడిలో కనీస సౌకర్యాలు లేనందున అక్కడ పనిచేసేందుకు ఉద్యోగులెవ్వరూ ముందుకురావడంలేదు. దీంతో తాత్కాలిక భవనాల టెండర్లు రద్దుచేయడంతోపాటు, అద్దెభవనాలవైపు మొగ్గుచూపింది సర్కారు. లోటు బడ్జెట్ లోనూ దుబారా ఖర్చులకు ఏమాత్రం వెనుకాడనంటోన్న బాబు ప్రభుత్వం.. తాజా అనాలోచిన నిర్ణయంవల్ల ప్రజలపై మరో రూ.300 కోట్ల భారాన్ని మోపనుంది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల స్పందనలు తెలియాల్సిఉంది.