బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది, అధికారుల యూనియన్లు, అసోసియేషన్లతో ఏర్పడిన జేఏసీ డిసెంబరు 15వ తేదీ చేపట్టనున్న ఒక్కరోజు సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆల్ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్/ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఏఐబీడీపీఏ) జిల్లా కార్యదర్శి ఎం.యాకోబ్ తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సమ్మెకు ఏఐబీడీపీఏ మద్దతు
Nov 30 2016 11:17 PM | Updated on Sep 4 2017 9:32 PM
– ఏఐబీడీపీఏ జిల్లా కార్యదర్శి ఎం.యాకోబ్ వెల్లడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది, అధికారుల యూనియన్లు, అసోసియేషన్లతో ఏర్పడిన జేఏసీ డిసెంబరు 15వ తేదీ చేపట్టనున్న ఒక్కరోజు సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆల్ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్/ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఏఐబీడీపీఏ) జిల్లా కార్యదర్శి ఎం.యాకోబ్ తెలిపారు. స్థానిక పాత బస్టాండు సమీపంలోని సీటీవో కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో కలిసి ఉన్న టవర్లను విడదీసి ప్రత్యేకంగా టవర్ కంపెనీ ఏర్పాటు చేయడం అన్ని విధాలా నష్టదాయకమన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆపరేటర్లు టవర్లకు ఫీజు చెల్లిస్తున్నారని, విడదీస్తే బీఎస్‌ఎన్‌ఎల్ సైతం టవర్ కంపెనీకి ఫీజు చెల్లించే దుస్థితి ఏర్పడుతుందన్నారు. క్రమేణా టవర్ కంపెనీని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళితే మరింత ప్రమాదమని హెచ్చరించారు. గతంలో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్‌ఎన్‌ఎల్)ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా అది టాటా కమ్యూనికేషన్స్‌గా రూపాంతరం చెందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడిన బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి టవర్ కంపెనీ వేరుచేయడం తగదని కోరారు. విలేకరుల సమావేశంలో ఏఐబీడీపీఏ సహాయ కార్యదర్శి పి.మద్దులేటి, సీనియర్ నాయకుడు కె.మల్లికార్జునయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement