జీవో 59లో అవకతవకలపై ఏసీబీ విచారణ | Sakshi
Sakshi News home page

జీవో 59లో అవకతవకలపై ఏసీబీ విచారణ

Published Fri, Sep 2 2016 11:50 PM

ACB enquairy at GO 59

జమ్మికుంట రూరల్‌ : గతంలో జమ్మికుంట తహసీల్దార్‌గా పని చేసిన రజిని పదవీ కాలంలో 59 జీవోలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు క్రమబద్ధీకరణ ద్వారా లబ్ధి చేకూర్చడంతో భారీగా ముడుపులు అందాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ సీఐ సుందరగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం కబ్జాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 59ని అనుకూలంగా మార్చుకున్న కొందరు తహసీల్దార్‌ సహకారంతో అక్రమంగా లబ్ధి పొందారని ఆరోపణలున్నాయి. వేలాది గజాల విలువైన భూములను అప్పటి తహసీల్దార్‌ రజిని అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కార్యాలయంలో సుదీర్ఘ విచారణ జరిపారు. దరఖాస్తులు, లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలో మొత్తం 180 దరఖాస్తులు అందగా.. 30 మంది దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. వారిలో పదిమందికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేశారు. విచారణలో భాగంగా ఎంత భూమిని కేటాయించారంటూ కొందరు లబ్ధిదారులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే.. తమ వద్ద సంబంధిత దస్తావేజులు లేవని వారు సమాధానం చెప్పడంతో రెవెన్యూ సిబ్బందిపై ఏసీబీ అధికారులు మండిపడ్డారు. 
 
 

Advertisement
Advertisement