
విషాహారం తిని 32 మందికి అస్వస్థత
రొద్దం మండలం గొబ్బరంపల్లిలో జరిగిన పెళ్లి వేడుకలో కలుషిత ఆహారం తిని 32 మంది అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు.
రొద్దం (పెనుకొండ) : రొద్దం మండలం గొబ్బరంపల్లిలో జరిగిన పెళ్లి వేడుకలో కలుషిత ఆహారం తిని 32 మంది అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి భోజనాలు ముగించాక అర్ధరాత్రి వేళ.. ఒక్కొక్కరికి వాంతులు మొదలయ్యాయని వివరించారు. దీంతో వారందరినీ వాహనాల్లో పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో నలుగురు చిన్నారులకు విరేచనాలు, వాంతులు ఎక్కువ కావడంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. వారిలో నవీన్‌కుమార్(7), హర్షవర్దన్(3), పూజా(6), కవిత(9), మమత(7) ఉన్నారు. నాగరాజు(45), లక్ష్మీనారాయణప్ప(50), రామాంజినమ్మ(40), ఆదెమ్మ(55), అంజినమ్మ(50), తిమ్మయ్య(40) తదితరులు పెనుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా 21 మంది కోలుకున్నారు.
విషయం తెలుసుకున్న జిల్లా డీఐఓ పురుషోత్తం, వైద్యాధికారిణి నీలిమ, సిబ్బంది శ్రీదేవి, ప్రభాకర్ తదితరులు గ్రామానికి చేరుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకల్లో బాదామ్ పౌడర్ అధిక మోతాదులో కలిపిన పాయాసం తినడంతో పాటు, ఎండ వేడిమి అధికంగా ఉండడంతో వారంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఉదయం వండిన పాయాసం రాత్రి పొద్దు పోయాక తిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే బాధితులను వైఎస్సార్‌సీపీ నాయకుడు అప్పిరెడ్డి, యూత్ కమిటీ సభ్యుడు నరసింహులు, టీడీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం గ్రామం మొత్తం బ్లీచింగ్ చల్లించారు. అస్వస్థతకు గురైన వారికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
పిల్లల ఆరోగ్యంపై ఆరా
అనంతపురం మెడికల్ : రొద్దం మండలం గొబ్బరంపల్లిలో కలుషిత ఆహారం తిని సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ పరామర్శించారు. శనివారం ఆస్పత్రిలోని చిన్న పిల్లల విభాగానికి వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరితో ఆరా తీశారు. సాయంత్రానికి పిల్లల ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.