మండల కేంద్రం నల్లమాడలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
నల్లమాడ (పుట్టపర్తి) : మండల కేంద్రం నల్లమాడలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక 17 మంది విద్యార్థినులు కడుపునొప్పితో విలవిలలాడినట్లు, మరో ముగ్గురు వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. సమీపంలో నివాసం ఉండే ఏఎన్‌ఎం ప్రమీల సమాచారం అందుకుని మరో ఏఎన్‌ఎం అరుణ, ఆశ కార్యకర్తలు వనజ, రమణమ్మలతో కలసి విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు.
ఉడకని చారు తినడం వల్లే..
సరిగా ఉడకని వెజిటబుల్ కర్రీ (చారు) తినడం వల్లే విద్యార్థినులకు కడుపునొప్పి, వాంతులు అయినట్లు మండల వైద్యాధికారి బాబ్‌జాన్ తెలిపారు. డాక్టర్‌తో పాటు సీహెచ్‌ఓ రామచంద్రారెడ్డి శనివారం ఉదయం పాఠశాలకు చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరీక్షించి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్, సీహెచ్‌ఓలు కూరగాయలను పరిశీలించారు. నాసిరకంగా ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట మనుషులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సూపర్‌వైజర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.