అట్లాంటాలో రాయలసీమ వనభోజనాలు | Rayalaseema picnic organized in Atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో రాయలసీమ వనభోజనాలు

Jun 27 2016 9:24 PM | Updated on Sep 4 2017 3:33 AM

అట్లాంటాలో రాయలసీమ వనభోజనాలు

అట్లాంటాలో రాయలసీమ వనభోజనాలు

రాయల అట్లాంటా గ్రూప్ ఆధ్వర్యంలో రాయలసీమ వనభోజనాల కార్యక్రమాన్ని అట్లాంటాలో ఘనంగా నిర్వహించారు.

రాయల అట్లాంటా గ్రూప్ ఆధ్వర్యంలో రాయలసీమ వనభోజనాల కార్యక్రమాన్ని అట్లాంటాలో ఘనంగా నిర్వహించారు. జూన్ 19న జార్జియాలోని బుఫోర్డ్ డ్యాం పార్కులో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 650 మంది హాజరై రాయలసీమ రుచులను ఆస్వాదించారు. రాయలసీమ ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రాయలసీమ వారు నిర్వహించినా తెలుగు వారందరు కలిసి చేసుకొనే కార్యక్రమమని తెలిపారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ రాయలసీమ పండుగ వాతావరణాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం జరపాలని కోరారు. కర్నూలు జిల్లా నంద్యాల నుండి ఇటీవలే కొడుకు దగ్గరికి వచ్చిన వంగల రెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వరం అలుగు కోసం ప్రజాసంఘాలు గత నెల చేప్పట్టిన శంకుస్థాపన కార్యక్రమం గురించి వివరించారు. ప్రవాస రాయలసీమ వారు ఇందులో ఏదో విధంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రాయలసీమ వైభవాన్ని, విభజన తరువాత రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చర్చించారు.

వనభోజనాల కార్యక్రమం జరిగినంతసేపు అతిథులు చాలా ఆహ్లాదంగా గడిపారు. ఆప్యాయంగా ఒకరినొకర పలకరించుకున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడుకోవటం చూస్తే ఆ ప్రాంతమంతా ఒక తిరుణాల వాతావరణం నెలకొంది. మొత్తం మీద రాయలసీమ ఔన్నత్యం అస్తిత్వం తెలియజేసే ప్రధాన లక్ష్యంతో మూడేళ్ళుగా చేస్తున్న ఈ కార్యక్రమం గత ఏడాది కంటే ఈసారి విజయవంతం కావటంతో నిర్వాహకులు రాయల అట్లాంటా గ్రూప్ సంతోషం వ్యక్తం చేసింది.


వనభోజనాలలో ఉదయం టిఫిన్లోకి హుగ్గాని, మిరపకాయ బజ్జి , పొంగలిని వడ్డించారు. మధ్యాహ్నం భోజనానికి: రాగిసంగటి , అలసంద వడలు, సియ్యల పులుసు, కోడి పులుసు, గ్రిల్ల్డ్ చికెన్, శనిక్కాయ ఊరిబిండి, ఉర్లగడ్డ తాళింపు, తిరవాత అన్నం , చిత్రాన్నం, నూనె వంకాయ, శెనగబ్యాళ్ల పాయసంతో కూడిన మెనూను వడ్డించారు. అతిథులంతా వంటకాలన్నింటిని ఆస్వాదించి ప్రశంసించారు. భోజనాల తరువాత పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement