పోలీసులమంటూ యువకుడి కిడ్నాప్‌

Young Man Kidnapped By Thieves In Prakasam - Sakshi

దర్శి (ప్రకాశం): ఓ యువకుడిని దుండగులు కిడ్నాప్‌ చేశారు. మండలంలోని తూర్పుచౌటపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొడిమెల చెంచారావు కుమారుడు వెంకటరాఘవేంద్ర (20)అనే యువకుడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లారు. స్థానికులు, తండ్రి తెలిపిన వివరాల మేరకు.. నలుగురు వ్యక్తులు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహాం వద్ద కూర్చొని సాయంత్రం 4గంటల సమయంలో సంచరిస్తూ కనిపించారు. ఎవరు మీరు అని గ్రామస్తులు ప్రశ్నించగా తాము రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులమని ఈ ప్రాంతంలో పొలాలు చూడటానికి వచ్చామని చెప్పారు.

ఆ తరువాత వారు గ్రామంలోని చెంచారావు నివాసం వద్దకు వెళ్లి చెంచారావు కుమారుడు రాఘవేంద్ర భుజంపై చెయ్యి వేసి రోడ్డు మీద వరకు నడుచుకుంటూ వచ్చారు. కాసేపు రాఘవేంద్రతో ముచ్చటించారు. కారు ఊరి చివర పొలాల వద్ద ఉంచి రాఘవేంద్రను బలవంతంగా కారు ఎక్కించబోగా రాఘవేంద్ర ప్రతిఘటించాడు. రోడ్డు పైన సమీపంలో ఉన్న ఆంజనేయులు అనే వ్యక్తి ఎందుకు బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్నారంటూ అడ్డుకోబోగా పోలీసులనే అడ్డుకుంటారా అంటూ ఆంజనేయులపై దాడి చేసి రాఘవేంద్రను కారులో ఎక్కించుకుని దర్శి వైపు తీసుకుని వెళ్లారు. విషయాన్ని ఆంజనేయులు.. చెంచారావుకు చెప్పాడు.

ఆయన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాఘవేంద్ర ఫోన్‌ రింగ్‌ అవుతుంది కానీ ఫోన్‌ ఎత్తడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవేంద్ర ఇంటర్‌ విద్య పూర్తి చేసి బెంగళూరులో పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆదినారాయణ అనే వ్యక్తి కిడ్నాపై మృతి చెందిన ఘటన మరువక ముందే మరో కిడ్నాప్‌ జరగడంపై నియోజకవర్గ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రాఘవేంద్ర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top