చదివింది పది.. ఐటీఉద్యోగిగా బిల్డప్‌ | A young man cheated unemployed | Sakshi
Sakshi News home page

ఇన్‌కం ట్యాక్స్‌లో ఉద్యోగాల పేరుతో రూ.కోటి వసూలు 

May 3 2018 12:39 PM | Updated on May 3 2018 12:39 PM

A young man cheated unemployed - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాధాకిషన్‌రావు

రాంగోపాల్‌పేట్‌ : ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి రూ. కోటి వసూలు చేసిన కేసులో నిందితుడిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.లక్ష నగదు, బాండ్‌ పేపర్లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్‌రావు, సెంట్రల్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.

ఉప్పుగూడకు చెందిన గంగాధర సతీష్‌కుమార్‌  పదవ తరగతి వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇన్‌ట్యాక్స్‌ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసేందుకు పథకం పన్నిన అతను ఆదాయ పన్ను శాఖలో అకౌంట్స్‌ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్, జూనియర్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్, సీనియర్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌తో పాటు అటెండర్‌ తదితర ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించేవాడు.

ఉద్యోగాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.3లక్షల వరకు లంచంగా ఇవ్వాలని చెబుతూ అడ్వాన్స్‌గా రూ. లక్ష వసూలు చేసేవాడు. 2014 నుంచి ఇలా దాదాపు 80 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ. కోటి వరకు వసూలు చేశాడు.  

కార్యాలయానికి తీసుకుని వెళ్లి 

నిరుద్యోగులను నమ్మించేందుకు సతీష్‌కుమార్‌ వారిని బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి తీసుకుని వెళ్లేవాడు. తాను కార్యాలయం లోపలికి వెళ్లి కొద్ది సేపు తిరిగి వచ్చి అధికారులతో మాట్లాడి వచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చేవాడు. త్వరలోనే మీ పని అయిపోతుందని నమ్మించేవాడు.  డబ్బు తీసుకున్న తర్వాత వారికి 6 డిజిట్స్‌ నంబర్‌ ఇచ్చి మీ ఉద్యోగాలు ఖాయమని చెప్పేవాడు.

ఉద్యోగం రాకపోతే ఈ నెంబర్‌ చెబితే డబ్బులు తిరిగివస్తాయని నమ్మించేవాడు. ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే కొత్త వారిని బుట్టలో వేసుకుని వారి ద్వారా బాధితుల అకౌంట్‌లో డబ్బు డిపాజిట్‌ చేయించేవాడు. మరికొందరికి రూ.20 బాండ్‌లపై రాసి ఇచ్చేవాడు.  బాధితుల్లో కొందరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం నిందితుడు సతీష్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అతడిని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్సై తిమ్మప్ప, సిబ్బందిని డీసీపీ అభినందించారు. 

పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు 

నిందితుడిపై సైబరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సనత్‌నగర్, నగర కమిషనరేట్‌ పరిధిలోని సైఫాబాద్, చాదర్‌ఘట్, షాలిబండ, చత్రినాక, ఫలక్‌నుమ, మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు.

నిరుద్యోగులు మోసపోవద్దు 

ఎవరైనా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని డీసీపీ రాధాకిష్‌రావు సూచించారు. ఏ ఉద్యోగమైనా పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement