ఆగని కలప దందా

Wood Smuggling In Mancherial - Sakshi

వేర్వేరు చోట్ల 5.64 లక్షల విలువైన    కలప పట్టివేత

కలప తరలిస్తున్న వాహనాలు స్వాధీనం

లక్సెట్టిపేట(మంచిర్యాల): ముందస్తు సమాచారం మేరకు ఆదివారం రాత్రి జన్నారం నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న ఇండికా కారును అంబేద్కర్‌ చౌరాస్తా వద్ద ఆపి అటవీ శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో పది టేకు దుంగలు, సుమారు పద్నాలుగు వేల విలువైనవి అధికారుల తనిఖీల్లో లభ్యమయ్యాయి. సోమవారం ఉదయం టాటా వెంచర్‌ వాహనంలో 31 టేకు దుంగలతో కలపను తరలిస్తుండగా ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకుని కలపను స్వాధీనం చేసుకున్నారు. కలప విలువ సుమారు రూ. లక్ష ఉంటుంది. వాహనాల డ్రైవర్లు పారిపోగా అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.  ఈ దాడిలో అటవీ క్షేత్రాధికారి అనిత, ఫారెస్టు డీటీ అజహర్, బీట్‌ అఫీసర్‌లు కలీం, ముజ్జు పాల్గొన్నారు. 

తిర్యాణి మండలంలో..
తిర్యాణి(ఆసిఫాబాద్‌): తిర్యాణి మండలం గడలపల్లి, బోరింగ్‌గూడ, గోయగాం గ్రామాల నుంచి అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న ఆశోక్‌ లేలాండ్‌ ట్రక్, ప్యాసింజర్‌ ఆటో, మోటార్‌బైక్‌ను పట్టుకుని అటవీ అధికారులు తిర్యాణి అటవీరేంజ్‌ కార్యాలయానికి తరలించారు. ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌ రేంజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తుండగా అక్రమంగా టేకు దుంగలు తరలిస్తున్న మూడు వాహనాలు తమకు తారసపడగా వాటిని తనిఖీ చేయగా ఆటో, ట్రక్‌లలో టేకుదుంగలు కనిపించాయి. బైక్‌పై తీసుకెళ్తున్న రెండు దుంగలను సైతం పట్టుకున్నారు. కాగా ఈ వాహనాల్లో తరలిస్తున్న 30 టేకుదుంగల విలువ రూ. 1.35 లక్షలు ఉంటుంది. కలప తరలించే వాహనాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు çఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రేంజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో అటవీ అధికారులు శంకర్, మహే«శ్, అనంతరావు ఉన్నారు.

కోటపల్లి మండలంలో..
కోటపల్లి(చెన్నూర్‌): కోటపల్లి మండలం అర్జునగుట్ట నుంచి చెన్నూర్‌కు అక్రమంగా జీపులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 కలప దుంగలను, జీపును ఎఫ్‌అర్వో రవి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుకున్న కలపను కోటపల్లి రేంజ్‌ ఆఫీసుకు తరలించారు. కలప విలువ రూ.15వేలు ఉంటుంది. ఇందులో ఎఫ్‌ఎస్‌వోలు రాములు, శ్రీనివాస్, ఎఫ్‌బీవో నాగరాజ్‌చారి, బేస్‌క్యాంప్‌ సిబ్బంది వెంకటేశ్, శ్రీనివాస్‌ ఉన్నారు.

ఛేజింగ్‌.. ఛేజింగ్‌
నిర్మల్‌అర్బన్‌: అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని నిర్మల్‌ అటవీశాఖ అధికారులు సోమవారం వేకువజామున పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిర్మల్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాన్ని ఆపేలోపే డ్రైవర్‌ ఆ వాహనాన్ని వెనక్కి తింపి ఆదిలాబాద్‌ వైపు తీసుకెళ్లాడు. దీంతో సిబ్బంది వాహనాన్ని వెంబడించారు. అయితే వాహనం అధికారుల కళ్లుగప్పి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో సోన్‌ మండలంలోని గంజాల్‌ గ్రామం వద్ద జాతీయ రహదారిపై అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు. కొన్ని గంటల తర్వాత నల్ల రంగు పాలిథిన్‌ కవర్‌ పైకప్పుగా ఉన్న వాహనం అటువైపుగా వచ్చింది. అధికారులను గమనించి  ఆపారు. ఆగకుండా వేగంగా ముందుకు వెళ్లిపోవడంతో అధికారులు వెంబడించారు. అటవీ శాఖ అధికారులను గమనించిన దుండగులు గంజాల్‌లోని ఓ వీధిలో వాహనాన్ని వదిలేసి, కారులో పారిపోయారు. నిలిపి ఉంచిన బులేరో వాహనాన్ని పరిశీలించగా, వాహనంలో 23 టేకు దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. కలపను పట్టుకున్న అధికారులను జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్‌రెడ్డి అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top