వృద్ధురాలి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి దారుణ హత్య

Published Sun, May 20 2018 7:07 AM

Women Murder In Nalgonda - Sakshi

భువనగిరి అర్బన్‌ : భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన రావి ఉమాదేవి (73) భర్త శంకర్‌రెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందాడు. ఉమాదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. చిన్న కుమారుడు, కుమార్తె స్మీతారెడ్డి ఆమెరికాలో ఉంటున్నారు. ఉమాదేవి తన భర్త చనిపోయినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్దకుమారుడు నర్సింహారెడ్డి వద్దకు వెళ్లి వస్తూ ఉంటుంది.

రైతుబంధు చెక్కు తీసుకునేందుకు..

ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు చెక్కు తీసుకోవడానికి ఉమాదేవి శుక్రవారం ఉదయం తన కొడుకు నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి నందనం గ్రామానికి వచ్చింది. ఉమాదేవి తనకు రావల్సిన చెక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌లను తీసుకుంది.4ఎకరాల భూమికి గాను రూ.16 వేల విలువ గల చెక్కు, పాస్‌పుస్తకాన్ని తీసుకుని గ్రామంలోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో కుమారుడిని హైదరాబాద్‌ వెళ్లి ఉదయం రమ్మని పంపించి ఇంట్లో ఒంటరిగానే ఉంది.

  ఇంట్లో ఒంటరిగా..

ఉమాదేవి గ్రామానికి వచ్చినప్పుడు ఆమెకు తోడుగా అదే గ్రామానికి చెందిన పొట్ట లక్ష్మమ్మ సహాయంగా ఉంటుంది. అయితే ఇటీవల తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు లక్ష్మమ్మ కొద్ది రోజుల క్రితం ఊరికి వెళ్లింది. దీంతో ఉమాదేవి ఇంట్లో ఒంటరిగా ఉంది.  

10.30 గంటల సమయంలో..

ఉమాదేవి ఇంటి తలుపులను మూసి టీవీ చూస్తోంది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో దుండగులు ఉమాదేవి ఇంటి వెనుక నుంచి గోడ దూకి లోనికి ప్రవేశించారు. మేడ పైనుంచి వెనుక భాగంలో ఉన్న పెంకుటింట్లోకి చొరబడ్డారు. ఎవరో ఇంట్లోకి వచ్చినట్లు అనుమానం వచ్చి పరిశీలిస్తుండగా దుండగులు ఆమెపై దాడికి తెగబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె చాలా సేపటి వరకు దుండగులతో ప్రతిఘటింటినట్టు ఘటన స్థలాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. దుండగులు ఆమె చీరకొంగును మెడకు ఉరివేసి అంతమొందించినట్టు ఆనవాళ్లు ఉన్నాయి.

అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, రెండు ఉంగరాలు, కాళ్ల కడియాలు, చేతి గాజులు మొత్తం 12 తులాల గల బంగారు ఆభరణాలను, ఇంట్లో ఉన్న బీరువాను తెరిచి రూ.20 నగదును అపహరించుకపోయారు.  
మృతురాలి కుటుంబానికి 
ఎమ్మెల్సీ పరామర్శ
నందనం గ్రామంలో జరిగిన హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌  మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు.  

కుమారుడి రాకతో..

ఉమాదేవి కుమారుడు ఉదయం 7గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో డ్రైవర్‌ను ఇంటిపైకి వెళ్లి చూడమని చెప్పాడు. అప్పటికే ఉమాదేవి విగతజీవిగా పడి ఉండడంతో గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు.  డీసీపీ రామచంద్రారెడ్డి స్థానికులను, కుటుంబ సభ్యులను, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

హైదరాబాద్‌ నుంచి రాచకొండ కమిషనరేట్‌ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్‌ డీసీపీ చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు భువనగిరి రూరల్‌ పోలీసులు కేసునమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు. ఉమాదేవిని తెలిసిన వ్యక్తులే అంతమొందించి ఉంటారని గ్రామంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ తమను గుర్తుపడుతుం దన్న ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి తెగబడినట్టు పోలీసులు భావిస్తున్నారు.  

1/1

మృతురాలి కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి

Advertisement
Advertisement