వీడని మిస్టరీ

Women Missing Case In Khammam - Sakshi

ఖమ్మంక్రైం: చదువుకునేందుకు, ఉద్యోగాలు, ఇతర వృత్తుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థినులు, యువతులు, మహిళలు సాయంత్రం ఇంటికొచ్చే వరకు ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు గుండెల్లో దడదడే. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీçపూర్‌లో అదృశ్యమైన బాలికలు, యువతుల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ప్రజల్లో వణుకుపుడుతోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు, పోలీస్‌స్టేషన్లలో నమోదైన చాలా కేసులకు పరిష్కారం దొరకని పరిస్థితి. తమ పిల్లలు తప్పిపోయారా.. ఎవరైనా కిడ్నాప్‌ చేశారా.. ఇప్పుడు వారు ఎక్కడున్నారనే విషయాలను తెలుసుకోలేక ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ఇక వర్కింగ్‌ హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థినులు, యువతులకు ఎంతవరకు భద్రత ఉంది..? ప్రస్తుత పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే.. 
పోలీసు రికార్డులనుబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా అదృశ్యం కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చదువుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు మాయమాటలు నమ్మి యువకులతో వెళ్లిన కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలిసో తెలియకో వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. వారి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పటికీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. మరికొందరు తమ పిల్లలు ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు రూ.లక్షలు ఖర్చు పెడుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు.

ఠాణా చుట్టూ ప్రదక్షిణలు.. 
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డల ఆచూకీ కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. కనీసం నెలలో ఐదుసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ పిల్లల ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అని అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసులు దీనిపై పెదవి విరవడంతో ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చి తమ బిడ్డలను మరిచిపోలేక ఒక పక్క రోదిస్తూ.. ఎక్కడో ఒక దగ్గర ఆచూకీ లభిస్తుందేమోనని మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు
 
కేసుల వివరాలిలా.. 
2017–18కి సంబంధించి అదృశ్యమైన మహిళలు, యువతుల కేసులలో సగానికిపైగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందులో పోలీస్‌ శాఖ కొంతవరకు పురోగతి సాధించిందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో 2017లో 183 మంది మహిళలు అదృశ్యం కాగా.. వారిలో 170 మందిని పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇంకా మిస్టరీగా ఉన్న 13 కేసుల్లో సుమారు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు 8 మంది ఉండగా.. మిగతా ఐదుగురు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు.

2018లో 222 మంది అదృశ్యం కాగా.. వారిలో 178 కేసులను పోలీసులు ఛేదించారు. వీరిలో 20 మందికి పైగా 18 నుంచి 30 ఏళ్లలోపు యువతులు ఉండగా.. మిగతా వారు 30 ఏళ్లపై నుంచి 50 ఏళ్ల పై వరకు ఉన్న మహిళలు ఉన్నారు. 2019లో ఇప్పటి వరకు అదృశ్యం కేసులు నమోదు కాలేదని పోలీస్‌ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2019లో ఇప్పటివరకు మహిళలకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయి. వీటిలో 35 కేసులను ఛేదించగా.. 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 25 బాలికల అదృశ్యం కేసులు నమోదు కాగా.. వీటిలో 15 పరిష్కారమయ్యాయి. 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో యువతులు అదృశ్యమైన సంఘటనలు ఇప్పటివరకు లేవు.

కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. 
జిల్లాలో మహిళలు, యువతుల అదృశ్యంపై నమోదైన అనేక కేసులను ఇప్పటికే ఛేదించాం. మహిళల అదృశ్యం జరుగుతున్న తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. పోలీస్‌ స్టేషన్‌లో ఇలాంటి కేసులు నమోదైతే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తరహా కేసుల్లో అదృశ్యం కావడానికి పలు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నాం. పోలీస్‌ శాఖ ఛేదించిన కేసుల్లో మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. అనేక సున్నితమైన అంశాలు సైతం బాలికలు, మహిళలు, యువతులు అదృశ్యం కావడంలో ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యత్‌లో జిల్లాలో ఈ తరహా కేసుల్లో నిందితులుగా తేలిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.  – తఫ్సీర్‌ ఇక్బాల్, పోలీస్‌ కమిషనర్, ఖమ్మం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top