అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంతలోకాలకు.. 

Women Died In Road Accident In moinabad - Sakshi

సాక్షి, మొయినాబాద్‌(రంగారెడ్డి) : అన్నా చెల్లిలి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష అంటూ చెల్లెలు రాఖీ కట్టింది. అన్నకు రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళ్తూ ఆ చెల్లెలుతో సహా ఆమె భర్త, కూతురు దుర్మరణం చెందిన సంఘటన చేవెళ్ల–శంషాబాద్‌ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం సుభాన్‌పూర్‌ గ్రామానికి చెందిన పోచారం బాల్‌రెడ్డి(40), అతని భార్య జ్యోతి(35), కూతురు సిరి(11), కుమారుడు సాయిచరణ్‌ గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా చేవెళ్లకు బైక్‌పై వెళ్లారు. జ్యోతి తన అన్నయ్య శ్రీనివాస్‌రెడ్డికి రాఖీ కట్టింది.

సాయంత్రం 6 గంటలకు సుభాన్‌పూర్‌ వెళ్లేందుకు చేవెళ్ల నుంచి నలుగురు బైక్‌పై బయలుదేరారు. 6:30 గంటలకు చేవెళ్ల–శంషాబాద్‌ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన జేసీబీ బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్‌తో సహా నలుగురిని తోసుకుంటూ జేసీబీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. జేసీబీ కింద నలిగిపోయిన భార్యభర్తలు బాల్‌రెడ్డి, జ్యోతి, వారి కూతురు సిరి అక్కడికక్కడే మృతిచెందారు. జేసీబీ కింద ఇరుక్కుని ఉన్న సాయిచరణ్‌ కాపాడండి అంటూ కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్తున్న వారు గమనించారు. అప్పటికే జేసీబీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాలుడిని జేసీబీ కింది నుంచి బయటకు తీసి చికిత్స కోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

జేసీబీ అతివేగంతోనే... 
కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి జేసీబీ అతివేగం, డ్రైవర్‌ అజాగ్రత్తే కారణంగా తెలుస్తుంది. జేసీబీని గంటకు 20 కిలోమీటర్ల స్పీడ్‌తో నడపాలి. కానీ జేసీబీ డ్రైవర్‌ అతివేగంతో వెళ్తుండగా ఎదురుగా బైక్‌ వస్తున్నా అదుపు చేయలేకపోయాడు. బైక్‌ను ఢీకొట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లడంతో వారు జేసీబీ కింద నలిగిపోయి మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయాడు. 

రెండు గ్రామాలో విషాదం... 
అన్నకు రాఖీ కట్టి తిరిగి వెళ్తూ ముగ్గురు మృతిచెందిన సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. మృతుల స్వగ్రామం మహేశ్వరం మండలం  సుభాన్‌పూర్‌తోపాటు జ్యోతి తల్లిగారు గ్రామం చేవెళ్లలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. రాఖీ పండుగరోజు ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top