మాయమైపోయాడమ్మా... మనిషన్నవాడు | Sakshi
Sakshi News home page

మాయమైపోయాడమ్మా... మనిషన్నవాడు

Published Mon, Nov 13 2017 6:56 AM

women death in road accident - Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ కాలు తెగిపడింది.. రక్తం ధారగా కారుతోంది. కళ్లు మూసుకుపోతున్నాయి. గొంతులో ఏదో మూల సన్నగా కాపాడండయ్యా అంటూ ఆర్తనాదం.. రయ్యమంటూ దూసుకెళుతున్న వాహనాలు ఒక్కటీ ఆగలేదు.. అందులో ఉన్న మనుషులూ మనసుల్లేని యంత్రాల్లాగే వెళ్లిపోయారు.. భరించలేని బాధతో నడిరోడ్డుపై గిలగిలాకొట్టుకుంటున్నా ఏ  ఒక్కరూ కనికరించలేదు. పాషాణ హృదయాల్లా కదిలిపోయారు.అంతులేని వేదనతో, మాటలురాని రోదనతో విలవిలలాడిన ఆ మహిళ అరగంటపాటు మృత్యువుతో పోరాడి చివరకు రోడ్డుపైనే తుదిశ్వాస విడిచింది. ఈ రాతి గుండెల సమాజంలో ఇక నేనుండలేనంటూ వెళ్లిపోయింది. ఆదివారం జి.కొండూరులో జరిగిన ఘటన మానవత్వానికి తీరని మచ్చ తెచ్చింది.

జి.కొండూరు(మైలవరం): విజయవాడ వాంబేకాలనీకి చెందిన నందేటి పద్మాబాయి (50) నడుంనొప్పికి వైద్యం చేయించుకునేందుకు  ఆదివారం ఉదయం జి.కొండూరు మండలంలోని చెవుటూరు గ్రామానికి వచ్చింది. తన ఎదురింట్లో ఉంటున్న ఖమ్మంపాటి సీతారామయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చింది. నాటు వైద్యం చేయించుకుని తిరిగి వెళ్తుండగా ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మధ్య ఉన్న బుడమేరు వంతెన దాటే క్రమంలో ఎదురుగా బూడిద లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను సైడ్‌ ఇవ్వమని సీతారామయ్య హారన్‌ కొట్టాడు. టిప్పర్‌ సైడ్‌ ఇచ్చినట్లు ఇచ్చి ఎదురుగా ఉన్న గొయ్యిని తప్పించేందుకు క్రాస్‌ తిప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.

వాహనంపై ఉన్న పద్మాభాయి కింద పడిపోవడంతో టిప్పర్‌ వెనుక టైర్లు ఆమెపైకి ఎక్కడంతో కాలు తెగిపడింది. తీవ్ర రక్తస్రావంతో సాయంకోసం అరుస్తున్నా స్థానికులెవరు ఆమె దగ్గరకు వెళ్లలేదు. అటుగా వెళ్తున్న ఆటోవాలాలు కూడా పట్టించుకోలేదు. అరగంట తరువాత 108 అంబులెన్స్‌ వచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న జి.కొండూరు ఎస్‌ఐ రాజేష్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు వాహనంలో ఆమెను విజయవాడ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పద్మాభాయి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

స్పందించని 108
కందులపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి మహిళ చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతుంటే, 108కు ఫోన్‌ చేసినా అరగంట వరకు రాలేదు. ఆటోవాలాలను ఎవరిని అడిగినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకురాలేదు. అంబులెన్స్‌ అయినా త్వరగా వచ్చి ఉంటే ఆమె ప్రాణం కోల్పోకుండా ఉండేదని తెలిసింది.

Advertisement
Advertisement