దేశం’ నేతల సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం

Women  Committed Suicide - Sakshi

 వేధింపులు భరించలేక అఘాయిత్యం

పురుగు  మందు తాగడంతో కలకలం

టీడీపీ ధర్మదీక్షలో న్యాయం కోసం నిరసన

కాకినాడ : ‘‘లక్షన్నరపోసి కొన్న స్థలంతో ఇల్లు కట్టేందుకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టనిచ్చేది లేదని ఇబ్బందుల పాల్జేస్తున్నారు. టీడీపీ సమావేశాలకు రావాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే దాడి చేసి కొడుతున్నారు. ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇతర ముఖ్యనేతల సమక్షంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం రేపింది.

జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లో శుక్రవారం జరిగిన టీడీపీ ధర్మ దీక్ష వేదికగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘మీ అండ చూసుకునే మా ప్రాంతంలోని టీడీపీ మహిళానాయకురాలు ఇలా వేధింపులకు పాల్పడుతోంది’ అంటూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చి అంతలోనే పురుగు  మందు తాగేసింది.

ధర్మదీక్ష జరుగుతోన్న దీక్షలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు  అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై ఆమెను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. 

స్థలం కొనుగోలుపై వివాదం

బాధితురాలి కథనం ప్రకారం.. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే పోలినాటి సత్యవేణి నుంచి కాకినాడ మహాలక్ష్మినగర్‌ ప్రాంతానికి చెందిన మల్లాడి లక్ష్మి సుమారు 40 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దాదాపు లక్షన్నర సొమ్ము కూడా చెల్లించింది. కొన్న స్థలంలో ఇల్లు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

దీంతో స్థలం అమ్మిన సదరు టీడీపీ నాయకురాలు మల్లాడి లక్ష్మి వద్దకు వచ్చి మరికొంత సొమ్ము ఇస్తేగానీ ఇల్లు కట్టేందుకు వీలులేదంటూ హెచ్చరించింది. ఎంతగా బతిమాలినా ఆమె ససేమిరా అనడంతోపాటు ఎదురు తిరిగితే దాడి చేసేందుకు సైతం వెనుకాడలేదు. పైగా తెలుగుదేశం పార్టీ సమావేశాలు జరిగితే తప్పనిసరిగా హాజరుకావాలని, ఆమె రాలేకపోతే కూతురినైనా పంపాలంటూ ఒత్తిడి చేసేది. వీటన్నింటిని అంగీకరించకపోవడంతో అనేక వేధింపులకు గురి చేస్తోందంటూ బాధితురాలు వాపోయింది.  

కుమార్తెపైనా దాడి.. మహిళకు చికిత్స

సర్పవరం (కాకినాడసిటీ): బాలాజీచెరువు సెంటర్‌లో టీడీపీ దీక్షస్థలంలో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మల్లాడి లక్ష్మి (40)ని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో తల్లిని చూసి కుమార్తె రోధిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. కేవలం మా అమ్మ ధర్మపోరాట దీక్షకు వెళ్లకుండా డ్యూటీకి వెళ్లినందుకు తన జుట్టు పట్టుకుని గోడకు వేసి కొట్టిందని కుమార్తె మౌనిక వాపోయింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top