కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం

Woman Trying To sell Her Baby Boy In Krishna District - Sakshi

పెనమలూరు : విజయవాడ చుట్టుగుంట గులామ్‌ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమారాణి గురువారం కానూరులోని తన కార్యాలయంలో వెల్లడించారు. ‘శిశువు తల్లి వేట బాలనాగమ్మ ఈనెల 7వ తేదీన పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. బాలనాగమ్మను శిశువును పెంచుకునే ఉద్దేశం లేదనే విషయం తెలుసుకున్న ఆస్పత్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైఎస్సార్‌ కాలనీకి చెందిన బి.రాణి.. ఆమెను సంప్రదించారు.

వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈనెల 15న బాలనాగమ్మ ఆస్పత్రి నుంచి స్వచ్ఛందంగా డిచార్జ్‌ అయ్యారు. రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డుకి అప్పగించారు. అనంతరం రాణి శిశువును గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే అంగన్‌వాడీ కార్యకర్తలకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఐసీడీఎస్‌ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా శిశువు విక్రయం వెలుగుచూసింది. శిశువును రక్షించి అత్యవసర వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా శిశువును విక్రయించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని పీడీ ఉమారాణి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top