
లక్నో : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గురువారం రతేన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటకు పొక్కింది. పోలీసుల కథనం ప్రకారం... ముజఫర్‌నగర్‌కు సమీపంలోని టోడా గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త సోదరుడి(అన్న) కుమారునితో శారీరక సంబంధం కొనసాగిస్తోందని స్థానికులు ఆరోపించారు. ఈ నెపంతో గ్రామ పంచాయతీ పెద్దలు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆమెను విచక్షణా రహితంగా స్పృహ కోల్పోయేలా చితకబాదారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధిత మహిళను వైద‍్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.