భార్యను కిడ్నాప్‌ చేసి చంపేశాడు | wife kidnap, murdered by husband | Sakshi
Sakshi News home page

భార్యను కిడ్నాప్‌ చేసి చంపేశాడు

Jan 5 2018 12:32 PM | Updated on Jan 6 2018 2:23 AM

wife kidnap, murdered by husband - Sakshi

ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): భార్యను కిడ్నాప్‌ చేసి.. హత్య చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో గురువారం రాత్రి జరిగింది. టేకులపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇల్లెందుకు చెందిన పుల్లిగండ్ల పద్మ(30), కారేపల్లి మండలం తొడిదలగూడేనికి చెందిన ఆటో డ్రైవర్‌ బండారు ప్రభాకర్‌ 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభాకర్‌ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. తరచూ భార్యను హింసించటం మొదలు పెట్టాడు.

భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు టేకులపల్లి నుంచి జెడ్పీకి బదిలీ కావడంతో ఖమ్మానికి మకాం మార్చారు. అక్కడ కూడా తరచూ వేధించడంతో పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా, పెద్దలు పంచాయితీ చేసినా ప్రభాకర్‌లో మార్పు రాలేదు. వేధింపులు తాళలేక రెండు నెలలుగా పద్మ పిల్లలతో కలిసి ఇల్లెందులోని పుట్టింటిలో ఉంటోంది. అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా రోజూ ఖమ్మం నుంచి ఇల్లెందుకు రాకపోకలు సాగిస్తోంది.

ఈ క్రమంలో గురువారం రాత్రి 7.30 గంటలకు ఇల్లెందులో బస్సు దిగి ఇంటికి వెళ్తోంది. పద్మ కోసం కాపు కాసిన ప్రభాకర్‌ మరో ఇద్దరితో కలిసి కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్లారు. కేకలు వేస్తుండటంతో ఆటోలోనే చున్నీని మెడకు చుట్టి చంపేశాడు. మృతదేహాన్ని మొట్లగూడెం వెళ్లే దారిలో రోడ్డు పక్కన పడేశారు. నిందితులు ప్రభాకర్‌తో పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన మరో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ జి. ప్రకాశరావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement