సాక్షి,నిజామాబాద్: ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవాళ్లు. కట్టుకున్న భార్యే ఆ ఇంటికి మహాలక్ష్మి అనుకునేవాళ్లు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు దారి తప్పుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి, కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తలను కూడా మరిచిపోతున్నారు. తమ చీకటి బంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు.
ప్రియుడితో కలిసి మొగుడిని చంపి, శవాన్ని బ్లూ డ్రమ్‌లో పెట్టి సిమెంట్ పోసిన మీరట్ దారుణం, పూణే లోహ్‌గఢ్ కోట నుంచి కాబోయే భర్త కేతన్ అర్వాల్‌ను తోసేసి ప్రాణం తీసిన ఘటన మరువకముందే.. నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. బిల్డింగ్ పైనుంచి తోసేసినా చావలేదని, ఆస్పత్రిలో సెలైన్ బాటిల్‌లో ఏకంగా ‘హార్పిక్’ ఎక్కించి భర్తను చంపేసింది. దీంతో మన ఇంట్లోప్రాణం తీసే ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య దంపతులు. కుటుంబ పోషణ కోసం, భార్యాపిల్లల భవిష్యత్తు కోసం ప్రశాంత్ కన్నవారిని, కట్టుకున్న దేశాన్ని వదిలి సౌదీ అరేబియా (గల్ఫ్) వెళ్లాడు. అక్కడ పగలు రాత్రి కష్టపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. అయితే, ఇక్కడ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న భార్య సంధ్య మనసు మాత్రం పక్కదారి పట్టింది. ఇంద్రాపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త దూరంగా ఉండటంతో వీరి చీకటి బంధం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. ఈ విషయం కాస్తా గల్ఫ్‌లో ఉన్న ప్రశాంత్‌కు తెలియడంతో, అతడు ఫోన్ చేసి భార్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఫోన్లలోనే గొడవలు మొదలయ్యాయి.
గల్ఫ్ నుంచి రాక... మృత్యుపాశమై నిలిచిన భార్య
తమ మధ్య గొడవలు సర్దుమణిగించుకుందామనో ఏమో గానీ, జూన్ 27వ తేదీన ప్రశాంత్ గల్ఫ్ నుంచి తన సొంతూరికి తిరిగి వచ్చాడు. భర్త ఇండియాకు రావడంతో తన అక్రమ బంధానికి అడ్డుకట్ట పడుతుందని సంధ్య భావించింది. అతడిని శాశ్వతంగా వదిలించుకుంటేనే తాను, తన ప్రియుడు హ్యాపీగా ఉండొచ్చని క్రూరమైన పథకం రచించింది. ఇందుకోసం తనకు పరిచయమున్న న్యాల్‌కల్ గ్రామానికే చెందిన వెంకట సాయి అలియాస్ బంటి అనే యువకుడిని పురమాయించింది.
దాబా పైనుంచి తోసేసినా తప్పిన ముప్పు
పథకం ప్రకారం... జూన్ 29వ తేదీ రాత్రి ప్రశాంత్, బంటి కలిసి ఇంటి దాబాపై కూర్చుని మద్యం తాగేలా సంధ్య ఏర్పాట్లు చేసింది. ప్రశాంత్ ఫుల్లుగా మద్యం మత్తులోకి జారుకోగానే... సంధ్య, బంటి కలిసి అతడిని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. కింద పడిన ప్రశాంత్ రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ, ఒళ్లంతా తీవ్ర గాయాలవ్వడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నర్సు బుద్ధి పోనిచ్చుకోలేదు... సెలైన్‌లో హార్పిక్!
పైనుంచి పడినా భర్త బతికాడే అని సంధ్య కళ్లల్లో భయం, కసి పెరిగాయి. ఆస్పత్రిలో కోలుకుంటే తన గుట్టు రట్టవుతుందని భావించింది. తను నర్సు అన్న విషయాన్ని, ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిని దారుణంగా వాడుకుంది. ఆస్పత్రిలో భర్తకు ఎక్కుతున్న సెలైన్ బాటిల్‌ను గమనించిన సంధ్య... ఎవరూ లేని సమయం చూసి టాయిలెట్ క్లీన్ చేసే ‘హార్పిక్’ను సిరంజి ద్వారా సెలైన్ బాటిల్‌లోకి ఎక్కించింది. ఆ విషపూరిత కెమికల్ ప్రశాంత్ శరీరంలోకి పాకడంతో పరిస్థితి విషమించి అతడు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.
పోలీసుల స్టైల్ విచారణ... కటకటాల వెనక్కి కిరాతకులు
ప్రశాంత్ హఠాన్మరణంతో అనుమానం వచ్చిన అతడి తల్లి... కోడలు సంధ్యతో పాటు మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. సంధ్య, బంటి, అనిల్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీసేసరికి పాపం పండింది. తామే పక్కా ప్లాన్‌తో ప్రశాంత్‌ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో భార్య సంధ్య, ఆమెకు సహకరించిన బంటి, ప్రియుడు అనిల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ దారుణ హత్య కేసులో భర్త ప్రశాంత్‌ను చంపడానికి భార్య సంధ్య ఎంతలా దిగజారిందో చెప్పే ఆడియో సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె తన ప్రియుడు అనిల్‌తో మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాడికి ఫుల్లుగా మందు తాగించి ప్రాణం తీసేయ్.. మేడ మీద నుంచి కిందకి తోసేయ్ అంటూ సంధ్య ఆ ఆడియోలో ప్రియుడికి స్కెచ్ చెప్పింది. దానికి అనిల్ భయపడుతూ.. నా వల్ల కాదు.. నేను చేయలేను అంటూ తప్పుకోవాలని చూశాడు.
కానీ, మోహంతో కళ్లు మూసుకుపోయిన సంధ్య మాత్రం వదలకుండా.. ప్లీజ్‌రా.. నా మొగుణ్ని చంపేయ్ అంటూ ప్రియుడిపై పదే పదే ఒత్తిడి తెచ్చింది. చివరికి ప్రియురాలి కోరిక తీర్చడానికి అనిల్ సరేనన్నాడు.
అయితే, హత్య చేయాల్సిన రోజు రాత్రి ఇంకొక ఊహించని ట్విస్ట్ జరిగింది. ప్లాన్ ప్రకారం ప్రశాంత్‌తో కలిసి మద్యం తాగిన ప్రియుడు అనిల్,హత్యకు సహకరించిన బంటి ఆ మత్తు తట్టుకోలేక తనే స్పృహ కోల్పోయాడు. దీంతో అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుందని భయపడిన ఆ రాక్షస భార్య.. స్వయంగా రంగంలోకి దిగింది. భర్త ప్రశాంత్ మద్యం మత్తులో మేడ అంచున నిలబడి ఉన్న సమయంలో.. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా అతడి రెండు కాళ్లను పైకి పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు నెట్టేసింది. ఈ కుట్రకు సహకరించిన బంటి పోలీసుల విచారణలో ఈ షాకింగ్ నిజాలన్నింటినీ పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు.


