క్రైమ్‌ రిపోర్టు విడుదలలో జాప్యం ఎందుకు? | Where is Crime Report | Sakshi
Sakshi News home page

Nov 30 2017 3:36 PM | Updated on Aug 11 2018 8:45 PM

Where is Crime Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో గతేడాది చోటుచేసుకున్న నేరాలకు సంబంధించిన వివరాల నివేదికను ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ నవంబర్‌ నెల ముగిసే నాటికి కూడా విడుదల చేయక పోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రతి నెలా జూలై నెల చివరలో నేరాల వివరాల నివేదికను విడుదల చేయడం బ్యూరో ఆనవాయితీ. జూలై నెల గడిచిపోయి నేటికి నాలుగు నెలలవుతున్న విడుదల చేయకపోవడం విచారకరం. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతందని ప్రశ్నించగా పాలనాపరమైన, విధానపరమైన ఇబ్బందులే కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

బీజేపీ అధికారంకి వచ్చాక గతేడాది ఎక్కువగా జరిగిన గోరక్షక దాడులు, ప్రజలే జరిపిన దాడులకు నివేదిక జాప్యం జరగడానికి ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు. దేశంలో గతేడాది గోరక్షణ పేరిట దేశంలో దళితులు, ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోలో తప్పనిసరిగా చేర్చాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌కు అయిష్టంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అధికారులు అంగీకరించారు. అందుకనే ఇప్పటికీ నివేదిక విడదల కాలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బ్యూరో అధికారులు తెలిపారు. ప్రభుత్వం సూచన మేరకు తాము గోరక్షక దాడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించామని, అయితే ఈ రికార్డుల్లో భాగంగా దాన్ని పొందుపర్చడం లేదని, ప్రభుత్వం సలహా మేరకు ప్రత్యేక అనుబంధ నివేదిక కింద వాటిని విడుదల చేస్తున్నామని వారు చెప్పారు. 

1953 నుంచి దేశంలో జరుగుతున్న నేరాలు-ఘోరాలకు సంబంధించిన వివరాలను నేషనల్‌ రికార్డ్స్‌  బ్యూరో నమోదు చేస్తూ ప్రతిఏటా విడుదల చేస్తూ వస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఈ వివరాలను పంపించేందుకు జనవరి నెల నుంచి జూన్‌ నెలవరకు దాదాపు ఐదు నెలల సమయం ఇస్తోంది. ఆ వివరాలను వివిధ విభాగాల కింద క్రోడీకరించి జూలై చివరి నాటికి నివేదిక రూపంలో బ్యూరో విడుదల చేస్తోంది. రెండు నెలల క్రితమే నివేదిక జాప్యం గురించి బ్యూరోను మీడియా ప్రశ్నించగా, బ్యూరో కార్యాలయాన్ని ఆర్కేపురం నుంచి మెహ్రాలికి మార్చడం వల్ల జాప్యం అవుతోందని చెప్పారు. మరి ఇంత లేటవడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా నోరు విప్పడానికి ఉన్నతాధికారులు ఇష్టపడడం లేదు. వాస్తవానికి బ్యూరో రెండు నెలల క్రితమే నివేదికను ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపించారని, ఇంకా అక్కడి నుంచి అనుమతి రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హిమాచల్, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను దష్టిలో పెట్టుకునే నివేదికను విడుదల చేయడం లేదని ఆ వర్గాలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement