చెవి కొరికి..చెప్పులతో కొట్టుకున్న వీఆర్వోలు

VROs Fight Infront Of Tahsildar In Kurnool - Sakshi

విచక్షణ మరచిన వీఆర్వోలు 

తహసీల్దార్‌ ఎదుటే బాహాబాహీ 

మామూళ్ల వ్యవహారమే  ప్రధాన కారణం 

సాక్షి, కర్నూలు రూరల్‌: గ్రామస్థాయిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన వీఆర్వోలు విచక్షణ మరిచారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న మాట మరచి వీధి రౌడీల్లా మారిపోయారు. యుష్టి యుద్ధానికి దిగారు.. చెప్పులతో దాడి చేసుకున్నారు. కోపోద్రిక్తుడైన ఓ వీఆర్వో.. చెవి కొరికి కక్ష తీర్చుకున్నాడు. ఆదివారం ఉదయం కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  కర్నూలు మండలం సుంకేసుల వీఆర్వోగా వేణుగోపాల్‌ రెడ్డి కొనసాగుతున్నాడు. ఈయనకు వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్‌ నమోదు చేసే బాధ్యతను  తహసీల్దార్‌ తిరుపతి సాయి అప్పగించారు.

తహసీల్దార్‌ డిజిటల్‌ కీని సైతం జూలై నెలలో ఇచ్చారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో పేర్లు మార్పులు, చేర్పులు చేస్తున్నాడు. ప్రతీ ఆన్‌లైన్‌ మార్పు, చేర్పునకు ఆ గ్రామంలో భూమికి ఉన్న ధరను బట్టి ఎకరానికి రేటు నిర్ణయించి తీసుకునేవాడని రైతులు చెబుతున్నారు. జొహరాపురానికి చెందిన మహేశ్వరయ్య పేరు ఆన్‌లైన్‌లో మహేశ్వరమ్మ అని పడింది. అలాడే అదే గ్రామానికి చెందిన  పాండురంగస్వామి ఇంటి పేరు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఈ రెండింటిని మార్చాలని జొహరాపురం వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు ఫైల్‌ పెట్టాడు. రెండు వారాలైనా పనికాకపోవడంతో ఆదివారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డిని  శ్రీకృష్ణదేవరాయలు గట్టిగా నిలదీశాడు. మాటామాటా పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల్‌ రెడ్డి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. దీంతో చెవి నుంచి విపరీతంగా రక్త్రస్తావమైంది. ఇద్దరూ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో వెంటనే తహసీల్దార్‌ తిరుపతి సాయి కలుగజేసుకొని తహసీల్దార్‌ కార్యాలయంలో రాజీ కుదిర్చడానికి ప్రయత్నించాడు. మరోసారి ఇద్దరు వీఆర్వోలు  రెచ్చిపోయి సాక్షాత్తూ తహసీల్దార్‌ ముందే ఒకరినొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. మరో సారి  వేణుగోపాల్‌రెడ్డికి చెవిని శ్రీకృష్ణదేవరాయలు కొరికాడు. వీఆర్వో శ్రీకృష్ణదేవరాయలు.. రైతుల నుంచి ఆన్‌లైన్‌ ఎక్కించడానికి రూ.లక్షలు తీసుకున్నాడని, తనకు చిల్లిగవ్వ ఇవ్వడంలేదన్న భావన వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి నుంచి వ్యక్తం అయింది.   

ఇద్దరు వీఆర్వోల సస్పెన్షన్‌ – ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌  
కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు వీఆర్వోలపై జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ వేటు వేశారు. జొహరాపురం వీఆర్వో కృష్ణదేవరాయులు, సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్‌ చేస్తున్నట్లు రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది.. కార్యాలయాల బయట, లోపల ప్రజలకు అనుకువగా ఉండి గౌరవ మర్యాదలను పొందాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉండాల్సింది పోయి గొడవలు పడడం దారుణమన్నారు. భవిష్యత్‌లో మరెవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top