అనుమతి లేకుండా టాలెంట్‌ టెస్ట్‌

Vizianagaram Corporate Schools Held Talent Test Without Permissions - Sakshi

సాక్షి, విజయనగరం క్రైమ్‌: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్‌జీ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు  టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. పరీక్ష రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలను ఆన్‌లైన్‌ ద్వారా వసూలు చేశారు. ఐదో నుంచి పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖకు చెందిన ఈ కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం, బాలల హక్కులను తుంగలో తొక్కి పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘ ప్రతినిధులు సత్తి అచ్చిరెడ్డి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అక్కడ నుంచి జిల్లా విద్యాశాఖాధికారులతో ఫోన్‌లో మాట్లాడగా...పరీక్షల నిర్వహణకు ఎటువంటి అనుమతుల్లేవని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు స్థానిక తోటపాలెంలో ఉన్న పరీక్ష కేంద్రమైన ఫోర్‌ ఎస్‌ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

                             హాల్‌టికెట్‌ చూపిస్తున్న విద్యార్థి

పరీక్ష నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్‌ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్, స్వేచ్ఛను హరించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే ఎంట్రన్స్, మోడల్‌ టెస్ట్‌లు వంటివి నిర్వహించుకోవాలే తప్ప అధిక రుసుం వసూలు చేయకూడదన్నారు. విద్యాశాఖ, పోలీస్, ఎస్‌ఎఫ్‌ఐ సహకారంతో పరీక్షను నిలిపివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top